
ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించిన అనంతరం జింబాబ్వే ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. మ్యాచ్ అనంతరం మైదానంలో తెగ హడావుడి చేసిన ఆ జట్టు ప్లేయర్స్.. తిరుగు ప్రయాణంలో బస్సులో అంతకుమించిన సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బస్సులో ఆటగాళ్లంతా డ్యాన్స్‌లు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందంలో మునిగితేలారు. దీనికి సంబంధించిన వీడియోను ఆ దేశ క్రికెట్ బోర్డు ట్విటర్‌లో షేర్ చేయగా, ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఏమాత్రం అంచనాలు లేని జట్టు ప్రపంచ మేటి జట్టుకు షాకిస్తే ఇలాగే ఉంటదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా, ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పసికూన జింబాబ్వే 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆస్ట్రేలియాను వారి స్వదేశంలో మట్టికరిపించడంతో జింబాబ్వే ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆసీస్ గడ్డపై తొలి గెలుపు సాధించిన జింబాబ్వే సభ్యులు వినూత్న రీతిలో సంబురాలు చేసుకుంటూ నానా హంగామా చేశారు. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో గెలుపొందిన ఆసీస్ నామమాత్రంగా సాగిన ఆఖరి వన్డేలో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది.
#3rdODI | Castle Corner, see what you’ve done? But who can blame us! Thanks for the support and inspiration, home or away! @CastleCornerZW #AUSvZIM | #VisitZimbabwe pic.twitter.com/Vp6VYRWSXU
— Zimbabwe Cricket (@ZimCricketv) September 3, 2022
జింబాబ్వే లెగ్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్ సంచలన స్పెల్‌తో (3 ఓవర్లలో 5/10) చెలరేగడంతో ఆసీస్ 31 ఓవర్లలో 141 పరుగులకే చాపచుట్టేసింది. డేవిడ్ వార్నర్ (96 బంతుల్లో 94; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వార్నర్, మ్యాక్స్‌వెల్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. జింబాబ్వే బౌలర్లలో బర్ల్‌తో పాటు బ్రాడ్ ఇవాన్స్ (2/35), న్యాయుచి (1/15), నగర్వా (1/27), సీన్ విలియమ్స్ (1/36) కూడా రాణించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే సైతం మధ్యలో తడబడింది.
ఓపెనర్లు కైటానో (19; 4 ఫోర్లు), మరుమణి (35; 4 ఫోర్లు) పర్వాలేదనిపించినప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్లు మెదెవెరె (2), సీన్ విలియమ్స్ (0), సికందర్ రజా (8) దారుణంగా విఫలమయ్యారు. అయితే కెప్టెన్ రెగిస్ చకబ్వా (72 బంతుల్లో 37; 3 ఫోర్లు).. టోనీ మున్యోంగో (17), ర్యాన్ బర్ల్ (11)ల సహకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 39 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి అతి కష్టం మీద విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, స్టార్క్, గ్రీన్, స్టోయినిస్, అగర్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment