నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం.. చైతన్య తల్లి ఎమోషనల్‌ | - | Sakshi
Sakshi News home page

నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం.. చైతన్య తల్లి ఎమోషనల్‌

Published Tue, May 2 2023 8:25 AM | Last Updated on Tue, May 2 2023 8:51 AM

- - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): ఢీ కొరియోగ్రాఫర్‌ చైతన్య మృతదేహానికి నెల్లూరు ప్రభుత్వ వైద్యులు సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా స్వగ్రామానికి తరలించారు. వివరాలు.. లింగసముద్రం మండలం ముత్తంవారిపాళెం గ్రామానికి చెందిన సి.చైతన్య(32)కు చిన్నతనం నుంచే డ్యాన్స్‌ అంటే ఇష్టం. అమ్మ, నాన్న, చెల్లెలితో హైదరాబాద్‌లో ఉంటూ పలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యే రియాల్టీ షోల్లో కొరియోగాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదేళ్లుగా ఢీ షోలో ఓ బృందానికి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.

దీని ద్వారా వచ్చే రెమ్యునరేషన్‌ తన మెయింటినెన్స్‌, తనను నమ్ముకున్న డ్యాన్సర్లకు సరిపోయేది కాదు. దీంతో అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన నెల్లూరు క్లబ్‌లోని ఓ గదిలో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనపై మృతుడి బాబాయి మాల్యాద్రి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. చైతన్య తల్లిదండ్రులు హుటాహుటిన నెల్లూరుకు చేరుకున్నారు.

చైతన్య సెల్ఫీ వీడియో ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆయన అభిమానులు, స్నేహితులు, డ్యాన్సర్లు పదుల సంఖ్యలో సోమవారం నెల్లూరు జీజీహెచ్‌లోని మార్చురీ వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. డ్యాన్స్‌లో మెళుకువలు నేర్పడంతోపాటు తమను నడిపించిన మాస్టర్‌ చైతన్య భౌతికకాయాన్ని చూసి పలువురు డ్యాన్సర్లు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. బంధువులు, డ్యాన్సర్లు, స్నేహితుల అశ్రునయనాల నడుమ చైతన్య మృతదేహాన్ని కుటుంబసభ్యులు తమ స్వగ్రామానికి తరలించారు.

నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం
నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం. ఇలా చేస్తాడని అనుకోలేదు. నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు. అప్పుల కోసం చనిపోతాడని ఊహించలేదు. ఆత్మహత్య చేసుకునే 15 నిమిషాల ముందు నాతో ఫోన్‌లో మాట్లాడాడు. సన్మాన కార్యక్రమంలో డల్‌గా ఉన్నావు నవ్వూతూ ఉండమని చెబితే సరే అన్నాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్‌ కట్‌ చేయక ముందు జామాయిల్‌ చెట్లు అమ్మాను.. రూ.4 లక్షలు వస్తున్నాయని చెప్పాను. అప్పుడు కూడా ఏమీ చెప్పలేదు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను వాడి వద్ద ఏది దాచేదాన్ని కాదు. డబ్బులదేముంది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని చెప్పేవాడు. ఓ సారి ఫోన్‌ చేసి నీవు ఇంటికి రాలేదంటే నేను చచ్చిపోతా అంటే.. నువ్వు చచ్చిపోతే నన్నెవరు చూస్తారమ్మా.. నీ పక్కన నాక్కూడా బెర్త్‌ కన్ఫామ్‌ చేయమ్మా అన్నాడు. ఇప్పుడేమో ఒక్కడే వెళ్లిపోయాడు. నేను చచ్చిపోతున్నా.. నువ్వు కూడా రా అమ్మ అంటే.. నేను కూడా వెళ్లేదాన్ని కదా.
– చైతన్య తల్లి లక్ష్మీరాజ్యం

పదేళ్ల ప్రయాణం 
మా ఇద్దరిది పదేళ్ల ప్రయాణం. చైతన్య చాలా సెన్సిటివ్‌ మనస్తత్వం. తన పక్కనుండే వారూ బాగుండాలని కోరుకుంటాడు. ఎవరికి ఇబ్బంది వచ్చినా అండగా ఉండేవాడు. రెండు రోజుల క్రితం తనతో మాట్లాడాను. ఎప్పుడూ అప్పులున్నాయని చెప్పలేదు. 
– చిట్టి, డ్యాన్స్‌మాస్టర్‌ 

చైతన్య లేడని ఊహించలేను 
ఇద్దరం పక్కపక్క సీట్లలోనే ఉండేవాళ్లం. ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. అప్పులున్నాయని ఎప్పుడూ చెప్పలేదు. ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదు. మాటలు రావడం లేదు.  
– పండు, డ్యాన్స్‌మాస్టర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement