నెల్లూరు నగరంలో జనసేనతో కలిసి పనిచేసేందుకు పచ్చనేతలు ససేమిరా
జనసేన నేతలను పట్టించుకోని మాజీ మంత్రి నారాయణ
పార్టీలోనే కోవర్టును పెట్టి చీలిక తెచ్చిన వైనం
నారాయణ తీరుపై గుర్రుమంటున్న జనసేన నాయకులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు పొడిచినా నెల్లూరు నగరంలో మాత్రం ఆ రెండు పార్టీల కలయికకు పచ్చనేతలు ససేమిరా అంటున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనతో కలిసి ఎన్నికల సమరానికి వెళ్లేందుకు టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి పొంగూరు నారాయణ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారానికి కూడా కేవలం టీడీపీ జెండాతోనే వెళుతున్నారు. ఓవైపు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాత్రం టీడీపీ నేతలు అవమానించినా వారితో కలిసి పనిచేయాలని పిలుపునివ్వడంతో ఏం చేయాలో అర్థంకాక జనసేన నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఆశలు ఆవిరై..
జనసేన నెల్లూరు నగర సీటుపై మొదటి నుంచి ఆశలు పెంచుకుంది. జిల్లాలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో టీడీపీతో పొత్తు కుదిరితే నెల్లూరు సీటు తమకే వస్తుందని ఆ పార్టీ నేత మనుక్రాంత్‌రెడ్డి ఎంతగానో ఆశపడ్డారు. అందుకు తగినట్లుగానే పార్టీ కీలకనేత నాదెండ్ల మనోహర్‌తో సన్నిహితంగా మెలిగేవాడు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర సీటు టీడీపీ అధినేత చంద్రబాబు బినామీగా ఉన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఓకే చేయడంతో జనసేన నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. నారాయణ టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినప్పటికీ జనసేన నేతలను పూచికపుల్లలా తీసేశాడు. నియోజకవర్గ పరిధిలో జరిగే ఏ కార్యక్రమాలకూ వారిని ఆహ్వానించడం లేదు. దీంతో జనసేన నేతలు నారాయణతో కలవలేక తమకు జరుగుతున్న అవమానాలకు మనస్సులోనే కుంగిపోతున్నారు. అవకాశం వచ్చినప్పుడు తామేంటో చూపిస్తామంటూ గుర్రుగా ఉన్నారు.
కోవర్టును పెట్టి..
మాజీ మంత్రి నారాయణ ఆది నుంచి జనసేనలో చీలిక తెచ్చేందుకు పావులు కదిపాడు. ఆ పార్టీలో తన కోవర్టును ఏర్పాటు చేసుకుని రెండు గ్రూపులుగా విడిపోయేలా చేశాడు. మనుక్రాంత్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని కూడగట్టి పార్టీ నేతలను విడగొట్టేలా తన కోవర్టును ఉపయోగించాడు. అనుకున్నట్లే కోవర్టు ద్వారా మనుక్రాంత్‌ను దెబ్బతీశాడు. జిల్లాలో ‘గ్లాసు’ను పట్టించుకోకుండా చేసి నారాయణ తన పంతం నెగ్గించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment