కావలి: సంధ్య వేళ.. తుమ్మలపెంటసముద్ర తీరం సందర్శకులతో కోలాహలంగా ఉంది. ఆదివారం కావడంతో స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు కూడా కుటుంబాలతో వచ్చి సముద్ర తీరంలో సేద తీరుతున్నారు. సందర్శకుల భద్రతను పర్యవేక్షిస్తూ ఇస్కపల్లి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్‌స్టేషన్ సిబ్బంది పహారా కాస్తున్నారు.
వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో సందర్శకులు కోలాహలంగా ఉన్నారు. సాయంత్రం 4.45 గంటల సమయంలో అలల ఉధృతిలో ఎక్కడో దూరంగా మనిషి కొట్టుకుపోతున్న విషయాన్ని కోస్టల్ సెక్యూరిటీ స్టేషన్ కానిస్టేబుల్ కే గోవిందరాజులు గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రాణాలకు తెగించి ఈదుకుంటూ వెళ్లాడు.
నిమిషాల వ్యవధిలోనే మునిగిపోతున్న వ్యక్తిని చేరుకుని ఒడ్డుకు తీసుకొచ్చాడు. వివరాలు ఆరా తీయగా సర్వాయపాళేనికి చెందిన వాదినాల సురేష్ రొయ్యల గుంతల్లో పనిచేసే తన స్నేహితులతో తుమ్మలపెంటకు వచ్చాడని తెలిసింది. మద్యం మత్తులో సముద్రంలో మునిగేందుకు వెళ్లగా అలల ఉధృతికి కొట్టుకుపోయాడు. మద్యం మత్తులో ఉండడంతో కాపాడాలని కేకలు వేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కానిస్టేబుల్ గోవిందరాజులు స్పందించడంతో అతని ప్రాణాలు దక్కాయని బీచ్‌లో ఉన్న వాళ్లంతా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment