అసలే పేద... ఆపై కేన్సర్
దాతలు ఆదుకుంటే ప్రాణాలు నిలబడే అవకాశం
ఇప్పటికే వైద్యానికి రూ.6 లక్షల ఖర్చు
సాయం కోసం ఎదురుచూపులు
రోజురోజుకు క్షీణిస్తున్న ఆరోగ్యం
పొదలకూరు: ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న వా రి కుటుంబంలో కేన్సర్ మహమ్మారి అలజడి రేపింది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబంపై పెద్ద ఉపద్రవమే వచ్చి పడింది. ఏడాది నుంచి వివిధ పరీక్షలు, మందుల పేరుతో రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం కానరాలేదు. ఇటీవల బయాప్సీ ద్వారా చర్మ కే న్సర్ అని తెలియడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కు ప్పకూలింది. రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోలేక దాతల కోసం నిస్సహాయంగా ఎదురుచూస్తోంది.
టైలర్ వృత్తే జీవనాధారం
మండలంలోని అయ్యగారిపాళెం గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు టైలర్ వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య మాధవి(32), కుమార్తె వెంకట రోషిణి(10) సంతానం. పేద కుటుంబానికి చెందిన శ్రీనివాసులు పేరున్న టైలర్ వద్ద పనిచేస్తూ దాని ద్వారా వచ్చే కూలి డబ్బులతో జీవిస్తున్నాడు. గతేడాది సెప్టెంబరులో మాధవికి చర్మంపై మచ్చలు వచ్చాయి. నెల్లూరు డాక్టర్ల వద్దకు వెళ్లి పలుమార్లు పరీక్షలు చేయించి మందులు వాడారు. మచ్చలు వస్తూపోతూ ఉండడంతో నెల్లూరు వైద్యానికే రూ.2 లక్షల వరకు ఖర్చుచేశారు. ఎలాంటి గుణం కనిపించకపోవడం వల్ల ఇటీవల చైన్నె విజయ మెడికల్ హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి బయాప్సీకి చర్మాన్ని పంపారు.
నివేదికలో లింపోమా (తెల్ల రక్తకణాల కేన్సర్)గా నిర్ధారించారు. తెల్లరక్త కణాల జన్యుమార్పులు సంభవించి అవి నియంత్రణ లేకుండా విభజించడం వల్ల చర్మ కేన్సర్ వస్తుందని వెల్లడించారు. ఈ పరీక్షలు, తాత్కాలిక వైద్యానికి శ్రీనివాసులు సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇందుకోసం తనకున్న కొద్దిపాటి నిమ్మచెట్లు, గేదెలను కూడా అమ్మాల్సి వచ్చింది. వైద్యం చేయించిన తర్వాత మాధవికి కొద్దిరోజులు నయమైనట్లు కనిపించినా మళ్లీ వ్యాధి తిరగబెట్టి మెడ, చంకలు, గజ్జలు, మోకలి పక్కన కాలిన మచ్చలు ఉన్నట్టుగా వస్తున్నాయి. దీని ప్రభావం వల్ల దురద, ఆకలి లేకపోవడం, జ్వరం, బరువు తగ్గడం వంటి దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. ఉన్నదంతా ఊడ్చి పెట్టినా మాధవికి నయం కాకపోవడంతో నిస్సహాయంగా వారి కుటుంబం మిగిలింది. పోషణ కూడా కష్టంగా మారడంతో పొదలకూరులోని మాధవి తల్లిదండ్రుల ఇంట్లో తలదాచుకుంటున్నారు.
దాతలు దయతలిస్తే..
ఆర్థికంగా చితికిపోయిన శ్రీనివాసులు కుటుంబాన్ని దాతలు ముందుకు వచ్చి ఆదుకుంటే మాధవికి వచ్చిన జబ్బు నయం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. రూ.లక్షలు వెచ్చించాల్సి రావడంతో వారు వైద్య పరీక్షలు కూడా చేయించుకోని స్థితిలో ఉన్నారు. రెండో పర్యాయం బయాప్సీ రిపోర్టు ఎలా వస్తుందోనని భయపడుతూ బిక్కుబిక్కుమంటున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకుంటే తన కుమార్తెకు తల్లిలేని లోటు లేకుండా ఉంటుందని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు స్పందిస్తే 9347142240 ఫోన్‌పేకు నగదు వేయాల్సిందిగా వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment