ఉద్యోగుల తొలగింపు
ఒకప్పుడు
రైతాంగానికి అండగా..
● నేడు సేవలు అందించలేని స్థితిలో..
● నష్టాల బాటలో పయనం
● ఉద్యోగులకు జీతాలివ్వడం కష్టమే..
● అవినీతి ఆరోపణలతో
రాజీనామా చేసిన బీఎం
కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లా కో– ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అన్నదాతలకు సేవలందించలేని స్థితికి చేరుకుంది. ఉద్యోగులకు
జీతాలివ్వడం గగనమైంది. ఇంత వరకు పాలకమండలిని ఏర్పాటు చేయలేదు.
నెల్లూరు(వీఆర్సీసెంటర్): 1942వ సంవత్సరంలో డీసీఎంఎస్ ఏర్పాటైంది. సబ్సిడీపై రైతులకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు పంపిణీ చేయడం నుంచి జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలకు ఫల సరుకులు, ఎన్నికల సమయంలో స్టేషనరీ, టీటీడీకి కందిపప్పు తదితరాలను అందించింది. ప్రజలకు నాణ్యమైన వస్త్రాలు, దీపావళి సమయంలో సరసమైన ధరలకు బాణసంచా, చక్కెర, కందిపప్పు లాంటి విక్రయాలు చేసిన చరిత్ర సొసైటీకి ఉంది. అదేవిధంగా జిల్లాలో ఽపలు ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి తద్వారా వచ్చే కమీషన్‌తో లాభాలు ఆర్జించింది. జిల్లాలో పలుచోట్ల విలువైన ఆస్తులను కూడా సంపాదించింది. కరోనా సమయంలో కూరగాయలు పంపిణీతోపాటు, జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఆర్థిక సాయం చేసింది.
నేడు ఇలా..
ఎంతో ఘన చరిత్ర కలిగిన డీసీఎంఎస్ నేడు ఉనికి కోల్పోయే స్థితికి చేరుకుంటోంది. సొసైటీకి సొంతంగా నగరంలోని స్టోన్‌హౌస్‌పేటలో సొంత కార్యాలయ భవనం ఉంది. నవాబుపేటలో ఎకరా స్థలంలో రైస్‌మిల్లు, ఆత్మకూరులో షాపింగ్ కాంప్లెక్స్‌లున్నాయి, వీటిలో అత్యధిక విలువైనది రైస్‌మిల్లు. ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్, గోదాములు కట్టి బాడగకు ఇచ్చి సొసైటీకి ప్రధాన ఆదాయవనరుగా చేయాలని గత చైర్మన్ వీరి చలపతిరావు ప్రతిపాదించి ఆ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా తెచ్చారు. దీంతో మిల్లును పడగొట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. సొసైటీ నేడు జనరిక్ ఔషధాల దుకాణం, ఎరువుల విక్రయ కేంద్రాన్ని మాత్రమే నడుపుతోంది. అయితే ఈ రెండూ వ్యాపారాలు నామమాత్రంగా సాగుతున్నాయి. గతంలో లాభాల బాటలో పయనించిన డీసీఎంఎస్ నేడు ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితికి చేరుకుంది. హామాలీలకు రూ.30 లక్షలకు పైగా వరకు బకాయిలు చెల్లించాల్సింది.
సవాలక్ష కారణాలు
డీసీఎంఎస్‌కు సుదీర్ఘంగా బీఎంగా వ్యవహిస్తున్న ఓ వ్యక్తి తన రాజకీయ పలుకుబడితో అధికారం చలాయిస్తూ అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలున్నాయి. కొందరు కింది స్థాయి ఉద్యోగులు కూడా అవినీతి బాటపడ్డారని ప్రచారం ఉంది. బీఎం, ఉద్యోగుల మధ్య ఏర్పడిన వివాదాలు, కోర్టు కేసులు లాంటి వ్యవహారాలతో సొసైటీ అభాసుపాలైంది. సంస్థ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అధికారి తన అనుయాయులకు ఉద్యోగాల ఇప్పించడం, ఇతర ఉద్యోగులతో కక్షపూరితంగా వ్యవహరించడంతో ఇరువర్గాల మధ్య కోల్డ్‌వార్ నడిచింది. వ్యక్తిగత దూషణలు, కేసులు పెట్టుకోవడం వరకు వెళ్లడంతోనే సంస్థ ప్రతిష్ట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. భారీగా నిధులను దుర్వినియోగం చేయడంతో అంతంతమాత్రంగా ఆదాయంతో ఉన్న డీసీఎంఎస్ నేడు తీవ్ర నష్టాల్లో నడుస్తోంది.
గాడితప్పిన పాలన
కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు డీసీఎంఎస్‌కు పాలకమండలిని నియమించలేదు. దీంతో పాలన పూర్తిగా గాడి తప్పింది. డీసీఎంఎస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
బీఎంగా వ్యవహరించిన వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా అవుట్ సోర్సింగ్ విధానంలో కొందరిని ఉద్యోగులుగా తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో స్పెషల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న జేసీ 12 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధులు నుంచి తొలగించారు. నేడు నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. బీఎం తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. కొద్దిరోజుల క్రితం కలెక్టర్ ఆనంద్ నూతన బిజినెస్ మేనేజర్ (బీఎం)గా సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిహిస్తున్న మోహన్‌కృష్ణను నియమించారు.
ఉద్యోగుల తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment