
సోమిరెడ్డి ఇసుక దోపిడీ నిజమని తేలింది
తమ అక్రమ సంపాదన కోసం రాజకీయ నేతలు బరితెగించారు. ఇసుక అక్రమ రవాణా నిలువరించాల్సిన అధికారులు నేతల సేవలో, మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో విరువూరు, సూరాయపాళెం ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక అక్రమ రవాణాపై సంబంధిత అధికార యంత్రాంగం దాదాపు తొమ్మిది నెలల తర్వాత కళ్లు తెరిచింది. నిజాలు తెలుసుకుని కట్టడి చేస్తున్నారా? లేక నిష్పక్షపాతంగా వ్యవహస్తున్నామని కనికట్టు చేస్తున్నారా? లేక కోర్టు స్టే ఉన్న విరువూరు రీచ్ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని భావించి ఇలా చేశారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదిఏమైనా.. స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని అధికారులు బట్టబయలు చేయడం చూస్తుంటే.. ఇన్నాళ్లు ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు నిజమే అని తేటతెల్లం చేస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లిలో టీడీపీ నేతలు రీచ్‌ల్లో ఇసుక దోపిడీ చేస్తున్నట్లు మైనింగ్ శాఖ అధికారుల దాడుల్లో తేట తెల్లమైంది. అధికారమే అండగా తొమ్మిది నెలలుగా విరువూరు, సూరాయపాళెం ఇసుక రీచ్‌లను అడ్డాగా చేసుకుని తమ్ముళ్ల ఇసుక మాఫియా చెలరేగిపోయింది. నిబంధనలకు పాతరేసి ఇసుక తవ్వేసి జిల్లా సరిహద్దులు దాటిస్తూ ధనార్జన సాగిస్తున్నారు. విరువూరు ఇసుక రీచ్‌లో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకున్నప్పటికీ దీనిపై కోర్టు స్టే విధించింది. అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తూ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వచ్చారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల అధికారులు ఇసుక రీచ్‌ల వైపు కన్నెత్తి చూడకపోవడంతో నదీ గర్భాన్ని కుళ్లబొడి చేశారు. విరువూరు రీచ్ నుంచి రేయింబవళ్లు బయట జిల్లాలతోపాటు పక్క రాష్ట్రాలకు ఇసుక రవాణా చేస్తున్నా.. పట్టించుకునే అధికారి లేకుండా పోయారు. భూగర్భ జలాలు, కరకట్టలు దెబ్బతింటున్నా.. పెన్నాబ్యారేజీకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని రైతులు చెబుతున్నా.. ఉచిత ఇసుకను నగదుగా మార్చి దోచుకుంటున్నారు.
ఇన్నాళ్లు తెలియదా? ఇప్పుడే కళ్లు తెరిచినట్లు!
గత తొమ్మిది నెలలుగా కోర్టు స్టే ఉన్న విరువూరు రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన మైనింగ్ శాఖాధికారులు ఇప్పుడే కళ్లు తెరిచినట్లుగా ఆ రీచ్‌పై దాడులు చేయడం, ఇసుక తవ్వే యంత్రాలతోపాటు లారీలు, టిప్పర్లను సీజ్ చేయడం చూస్తుంటే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రెగ్యులర్ డీడీ లేని సమయంలో జిల్లా మైనింగ్ అండ్ జియాలజీ డీడీ (ఎఫ్‌ఏసీ) బాలాజీనాయక్ సాహసించి విరువూరు ఇసుక రీచ్‌లో ఇసుక అక్రమ రవాణా బండారాన్ని బయట పెట్టారు. అక్కడి నుంచి పోలీసులకు ఫోన్ చేసినా వారు స్పందించకపోవడంతో కలెక్టర్‌కు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ.. సీజ్ చేసిన వాహనాలను పోలీసులకు అప్పగించడం వెనుక చాలా కథే ఉన్నట్లు సమాచారం. సర్వేపల్లి ప్రజాప్రతినిధి ఇసుక దోపిడీకి కళ్లెం వేసేందుకు అధికారులే నడుం బిగించారా? లేక స్టే ఉన్న రీచ్‌లో ఇసుక దోపిడీపై రేపు కోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితులు ఉంటాయని జాగ్రత్త పడుతున్నారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నిజంగా కళ్లు తెరిచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారంటే.. సురాయపాళెం రీచ్ నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోకపోవడం చూస్తే.. ఇది కనికట్టుగానే ప్రజలు భావిస్తున్నారు. సరే ఏది ఏమైనా విరువూరు రీచ్ నుంచి ఇసుక దోపిడీ జరుగుతుందనే విషయం బహిర్గతమైంది. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ చేశారంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ వచ్చిన ఆ ప్రజాప్రతినిధి ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ వస్తోంది.
డీడీపై ముఖ్యనేత ఆగ్రహం
విరువూరు రీచ్‌లో మైనింగ్ డీడీ దాడులు చేసి కలెక్టర్‌కు తెలియజేస్తున్న సమయంలోనే ఇసుకాసురుడు నియోజకవర్గ ముఖ్య నేతకు ఫోన్ చేసి డీడీకి ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. కలెక్టర్‌తో మాట్లాడుతున్నానని.. మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పినా వినిపించుకోలేదు. నా ఫోన్ కాల్ మాట్లాడకపోతే తాట వలుస్తా, బదిలీ చేయిస్తానంటూ సదరు ముఖ్య నేత ఊగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ ఆదేశాల మేరకే దాడులు చేశామని చెప్పినా ఆ నేత వినిపించుకోకుండా డీడీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
పొదలకూరు మండలం సూరాయపాళెం, విరువూరు ఇసుక రీచ్‌ల్లో విరువూరు రీచ్‌కు అనుమతి లేదు. కోర్టు స్టే ఉంది. అయినప్పటికీ ఈ రెండు రీచ్‌ల్లో సీసీ కెమెరాలు పెట్టి.. సమీపంలోనే కారులో నుంచే ఆపరేట్ చేస్తూ ఇసుక దోచుకుంటున్నారు. సర్వేపల్లి ముఖ్య నేత తన సొంతూరుకు చెందిన ఓ వ్యక్తి కనుసన్నల్లో రీచ్‌ను నడిపిస్తూ ఎవరికి చెందాల్సిన మామూళ్లు వారికి అందజేస్తున్నట్టు ప్రచారం ఉంది. ఈ రెండు రీచ్‌ల నుంచి నిత్యం 16 టైర్ల లారీల్లో సుమారు 75 వాహనాలకు పైగా నిత్యం 2,250 టన్నుల ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క వాహనానికి రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
విరువూరు రీచ్‌పై స్టే ఉన్నా..
ఆగని ఇసుక దోపిడీ
విరువూరు, సూరాయపాళెం రీచ్‌ల నుంచి యథేచ్ఛగా రవాణా
సర్వేపల్లి ముఖ్య నేత కనుసన్నల్లోనే..
మైనింగ్ డీడీ దాడులతో కూటమి నేతల ఉలికిపాటు
ఇసుక లారీల సీజ్‌తో డీడీపై సదరు ముఖ్య నేత ఆగ్రహం
పొదలకూరు మండలంలోని ఇసుక రీచ్‌ల ద్వారా సోమిరెడ్డి రూ.100 కోట్ల మేర ఇసుక దోపిడీకి ప్లాన్ చేశారని, మొదటి నుంచి చెపుతూనే ఉన్నాం. అధికారుల కళ్ల ముందే ఇసుక లారీలు వెళుతున్నా.. పట్టించుకోవడం లేదు. అధికారులు ఒక వేళ ఆపినా సోమిరెడ్డి అండదండలు ఉన్న కారణంగా లారీలు ఆగకుండా వెళ్లిపోయాయి. ఇప్పటికై నా అధికారులు రీచ్‌లో దాడి చేయడంతో ఇక్కడ దోపిడీ జరుగుతుందని ఈ జిల్లా ప్రజలకు తెలిసింది. సోమిరెడ్డి ఇసుక దోపిడీ నిజమని తేలింది. వాస్తవానికి సూరాయపాళెం, విరువూరు రీచ్‌ల్లో వందలాది లారీలు ఉన్నాయి. అధికారి వెళుతున్నాడనే సమాచారం తెలుసుకుని పంపించి వేశారు. దీన్ని బట్టి పరిశీలిస్తే సోమిరెడ్డి నీతి, నిజాయితీ ఎంతో తెలుస్తుంది.
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి
విరువూరు రీచ్‌పై కోర్టు స్టే ఉంది
పొదలకూరు మండలం విరువూరు ఇసుక రీచ్‌పై కోర్టు స్టే ఉంది. ఈ రీచ్ నుంచి ఇసుకను తరలించేందుకు వీలు లేదు. పోతిరెడ్డిపాళెం, సంగం, సూరాయపాళెం ఇసుక రీచ్‌లను పరిశీలించి విరువూరు రీచ్‌లో లారీలను గమనించి తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న లారీలు, హిటాచీలను సీజ్ చేసి పోలీసులకు అప్పగించాను. ఇక్కడి నుంచి ఎవరు ఇసుకను తరలించినా న్యాయస్థానాన్ని ధిక్కరించినట్లు అవుతుంది. – బాలాజీనాయక్, జిల్లా మైన్స్ అండ్ జియాలజీ డీడీ, నెల్లూరు

సోమిరెడ్డి ఇసుక దోపిడీ నిజమని తేలింది

సోమిరెడ్డి ఇసుక దోపిడీ నిజమని తేలింది
Comments
Please login to add a commentAdd a comment