
తమ్ముళ్ల గ‘లీజు’ దందా!
వలేటివారిపాళెం: మండలంలోని మాలకొండపై కొలువైన మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణలోని దుకాణాలకు పలు నాటకీయ పరిణామాలతో వేలం ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. టీడీపీ నేతలు గ‘లీజు’ దందాకు తెరతీశారు. దుకాణాల వేలానికి పాటదారులు రాలేదని చూపించి, నామినేషన్ పద్ధతిలో ఆ దుకాణాలను అతి చౌకగా కొట్టేయ్యాలనే కుతంత్రంతో టీడీపీ నేతలు వ్యాపారులను బెదిరించించినట్లు తెలుస్తోంది. దేవాలయ ప్రాంగంణంలో వ్యాపారాలు నిర్వహించుకునేందుకు 11 షాపులకు శుక్రవారం ఉప కార్యనిర్వహణాధికారి సాగర్‌బాబు లీజు వేలం పాట నిర్వహించారు. బొమ్మల విక్రయాల షాపు –1 రూ.5 లక్షలకు, షాపు–2 రూ.4 లక్షలకు, హోటల్ రూ.10.30 లక్షలకు హెచ్చుపాట పాడి షాపులను దక్కించుకున్నారు. మిగిలిన ఎనిమిది షాపుల విషయంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. గతంలో వేలం పాట పాడుకున్న వ్యాపారులు పర్యవేక్షణ అధికారిగా వచ్చిన వై.బైరాగిని నిలదీశారు. ‘గతంలో ఇన్‌చార్జి ఈఓగా దేవస్థానంలో పని చేశావు.. వ్యాపారులకు ఏం న్యాయం చేశావు, చెప్పిన మాటపై నిలబడకుండా అన్యాయం చేశావంటూ’ నిలదీశారు. దీంతో గతం గతహః ఇప్పుడేంటో మాట్లాడాలని బైరాగి వ్యాపారులను దబాయించారు. మిగిలిన ఎనిమిది షాపులకు వేలం పాటలో పాల్గొనేందుకు వచ్చిన వ్యాపారులను అధికార పార్టీ నాయకులు బెదిరించడంతో ఎవరూ పాటలో పాల్గొనలేదు. డిపాజిట్ కట్టేందుకు వచ్చిన వ్యాపారులను పాట పాడుకుంటే వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తామంటూ హెచ్చరించడంతో వెనుదిరిగిపోయారు. దీంతో ఆ ఎనిమిది షాపుల వేలం పాట నిలిచిపోయింది.
మూడు సార్లు వేలం నిలిచిపోతే..
మూడు సార్లు వేలం పాట నిలిచిపోతే ఆ తర్వాత వేలం లేకుండానే నామినేషన్ పద్ధతిపై షాపులను దక్కించుకునేందుకే వేలం జరగనివ్వకుండా కుతంత్రాలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఎనిమిది పెద్ద షాపుల్లోనే వ్యాపారం భారీగా జరిగేవి కావడంతో ఓ పథకం ప్రకారం రెండో సారి కూడా వేలం పాటను వాయిదా వేయించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. వేలం పాట విషయంలో ఇంత జరుగుతున్నా.. అంతా బైరాగిపై వదిలేసి ఉప కార్యనిర్వహణాధికారి సాగర్‌బాబు ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. మాలకొండ దేవస్థానంలో వేలం పాట పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించాలంటే డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఒక ఈఓ, గతంలో ఈ దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్‌గా, ఇన్‌చార్జి ఈఓగా పనిచేసిన అధికారిని నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి కుట్రలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. బైరాగి పనిచేసిన కాలంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అదే వ్యక్తిని పర్యవేక్షణ అధికారిగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాలకొండలో 11 షాపులకు వేలం పాట
మూడు షాపులను హెచ్చుపాటతో
దక్కించుకున్న వ్యాపారులు
ఎనిమిది షాపులకు నిలిచిన వేలం
టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకే
నాటకీయ పరిణామాలతో వాయిదా
Comments
Please login to add a commentAdd a comment