
మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు
నెల్లూరు (పొగతోట): రాబోయే వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశాల్లో చైర్‌పర్సన్ మాట్లాడారు. జిల్లాలో మంచినీటి పథకాలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ఇప్పటికే జెడ్పీ నుంచి రూ.14 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఆర్‌ఓ ప్లాంట్లను ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. ఆర్‌ఓ ప్లాంట్ల ద్వారా పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. వివిధ పనులకు సంబంధించి పూర్తి చేసిన బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుందంటూ జెడ్పీటీసీలు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. చైర్‌పర్సన్ స్పందిస్తూ బిల్లులను సకాలంలో మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ధాన్యం ధరలు తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యానికి మద్దతు ధర కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మించి ధాన్యం కొనుగోలు చేసేలా ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్డు పనులు వేగవంతం చేయాలని తెలిపారు. అందుబాటులో ఉన్న నిధులు ల్యాప్స్ కాకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుందన్నారు. ఆయా పథకాల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఇటీవల భోజనం సక్రమంగా లేదంటూ విద్యార్థులు ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకుంటున్నట్లు తెలుస్తుందన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలన్నారు. జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచాలన్నారు. ఉపాధి పనులు వేగవంతంగా జరిగేలా ఆయా శాఖల అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ విద్యారమ, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
రైతుకు మద్దతు ధర కల్పించండి
పనులు త్వరితగతిన పూర్తి చేయండి
స్థాయీ సంఘ సమావేశాల్లో
జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ
Comments
Please login to add a commentAdd a comment