తల్లీకుమారుడిపై హత్యాయత్నం
ఇందుకూరుపేట: గుర్తుతెలియని వ్యక్తులు తల్లీకుమారుడిపై హత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటన బుధవారం రాత్రి పున్నూరు రోడ్డు సమీపంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. రావూరు గ్రామానికి చెందిన ముంగర మాలిని తన కుమారుడు వైభవ్‌రెడ్డితో కలిసి నెల్లూరు నుంచి కారులో ఇంటికి బయలుదేరారు. పున్నూరు రోడ్డు సమీపానికి వచ్చేసరికి వారి కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న వైభవ్ కిందకు దిగి వారిని ప్రశ్నించబోయాడు. ఇంతలో ఏడుగురు మంకీ క్యాపులు ధరించి కత్తులతో వైభవ్‌రెడ్డి పైకి వచ్చారు. అప్రమత్తమైన అతను ఒక్కసారిగా కారులోకి ఎక్కి అద్దాలు వేశాడు. ఆ వ్యక్తులు కత్తులతో అద్దాలను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ఈలోగా అటుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిని చూసి పరారయ్యారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మాలిని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై నాగార్జున్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ సుధాకర్‌రెడ్డి గురువారం బాధితులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. బాధితులకు కొందరిపై అనుమానం ఉండటంతో వారి వివరాలను పోలీసులకు తెలియజేశారు.
నకిలీ బంగారం కేసులో
దర్యాప్తు ముమ్మరం
ఉదయగిరి: నకిలీ బంగారం ఇచ్చిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు. గుర్తుతెలియని మహిళలు ఉదయగిరిలోని ఓ బంగారు దుకాణానికి వెళ్లారు. నకిలీ బంగారం ఇచ్చి, అసలు బంగారు చైన్‌తోపాటు రూ.5 వేలు నగదు తీసుకుని బుధవారం ఉడాయించడంతో యజమాని సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఎస్సై గురువారం దుకాణాన్ని సందర్శించి సీసీ పుటేజిలను పరిశీలించారు. కేసుకు సంబంధించి కొంత పురోగతి సాధించామని, త్వరలోనే మహిళలను అరెస్ట్ చేస్తామని తెలిపారు.
విద్యుదాఘాతంతో
యువకుడి మృతి
వెంకటాచలం: విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు షాక్‌కు గురై శేషాద్రి (25) అనే యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని పూడిపర్తి గ్రామ సమీపంలోని పంట పొలాల వద్ద బుధవారం జరగ్గా గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన దార శేషాద్రి కరెంట్ పని నిమిత్తం పూడిపర్తి గ్రామానికి బుధవారం వచ్చాడు. పొలాల వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి పని చేస్తుండగా షాక్‌కు గురై కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం నెల్లూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ విషయంపై మృతుడి తండ్రి వెంకటరత్నం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయడంతో మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టీడీపీలో ఫ్లెక్సీల కలకలం
ఉదయగిరి: ఉదయగిరిలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కొంతభాగాన్ని బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. ఆధిపత్యం కోసం కొంతకాలంగా రెండు వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ముఖ్య అనుచరులు రామయ్య, లక్ష్మయ్యలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో వెంకటరెడ్డితోపాటు అనుచరుల ఫొటోలను చింపేయడంతో టీడీపీలో కలకలం రేగింది. సొంత పార్టీలోని ఓ వర్గం వారు ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని చెబుతున్నారు.
తల్లీకుమారుడిపై హత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment