పది పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు
● డీఈఓ బాలాజీరావు
ఆత్మకూరు: పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రధానోపాధ్యాయులు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు సహకరించాలని డీఈఓ ఆర్.బాలాజీరావు అన్నారు. ఆత్మకూరు డివిజన్ స్థాయిలోని 9 మండలాల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, రెసిడెన్షియల్, కేజీబీవీ, ప్రిన్సిపల్స్‌తో పట్టణంలోని చైతన్య పాఠశాలలో గురువారం ఓరియంటేషన్ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాలల వారీగా వంద రోజుల ప్రణాళిక అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పంపాలని చెప్పి రెండు రోజులైనా ఇంకా కొందరు స్పందించ లేదని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్‌ఎంలను మందలించారు. దీంతో పలువురు అప్పటికప్పుడు ఆ పత్రాలను సమావేశంలో అందజేసేందుకు ప్రయత్నించడం గమనార్హం. పబ్లిక్ పరీక్షల విధి, విధానాల గురించి, డీసీఈబీ కార్యదర్శి టి.రామ్‌కుమార్ వివరించారు. ఇంకా నెల్లూరు రూరల్ విద్యాశాఖాధికారి ఆర్.మురళీధర్ మాట్లాడారు.
హెచ్‌ఎంల అసంతృప్తి
ఓరియంటేషన్ కార్యక్రమాన్ని పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో చిన్న హాల్లో నిర్వహించడంతో డిప్యూటీ డీఈఓ ఎంవీ జానకిరామ్ పట్ల పలువురు హెచ్‌ఎంలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 9 మండలాలకు చెందిన వారు సుమారు వంద మందికిపైగా పాల్గొన్నారు. హాల్లో కేవలం 80 మంది మాత్రమే కూర్చొన్నారు. దీంతో పలువురు హాలు బయటే నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment