
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఈనెల 23న సీఎం చంద్రబాబు రానున్నారు. దీంతో ఎస్పీ జి.కృష్ణకాంత్ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం కలెక్టర్ ఒ.ఆనంద్, ఎస్పీ, ఇంటెలిజెన్స్ ఇతర శాఖల అధికారులతో కలిసి ఏఎల్‌ఎస్ (అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్)ను నిర్వహించారు. కనుపర్తిపాడు ఉన్నత పాఠశాలలోని హెలిప్యాడ్ నుంచి కన్వెన్షన్ సెంటర్, పార్కింగ్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.
టెండర్ల ఆహ్వానం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు మూలాపేటలోని ఏపీ స్టార్స్‌లో శిక్షణకు హాజరయ్యే జైళ్ల శాఖ సిబ్బందికి భోజన సదుపాయం అందించేందుకు 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి గానూ అర్హులైన కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ స్టార్స్ ప్రిన్సిపల్ ఎస్.రాజారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ ధరావత్తు రూ.20,23,500లని వెల్లడించారు.టెండర్ దక్కించుకున్న వారు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి 2026 మార్చి 31వ తేదీ వరకు భోజనం అందించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు మార్చి 4వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు టెండర్ల సీల్డ్ కవర్లను స్వీకరిస్తామన్నారు. పూర్తి వివరాలకు ఏపీ స్టార్స్‌ను సంప్రదించాలని కోరారు.
సర్పంచ్ చెక్‌పవర్ రద్దు
పొడిగింపు
పొదలకూరు: మండలంలోని ప్రభగిరిపట్నం సర్పంచ్ పి.వెంకమ్మ చెక్‌పవర్ రద్దును మరో ఆరునెలలపాటు పొడిగిస్తూ డీపీఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయం, సర్పంచ్‌కు వాటిని అందజేశారు.
గొలుసు దొంగ అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆయాను మాటల్లో పెట్టి ఆమె మెడలోని బంగారు గొలుసును తెంపుకెళ్లిన ఘటనలో నిందితుడిని నెల్లూరు చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. గాంధీనగర్ సమీపంలోని వీఎంఆర్ నగర్‌లో సొంగ బుజ్జమ్మ, పుల్లయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. బుజ్జమ్మ 15 ఏళ్లుగా మద్రాస్ బస్టాండ్ సమీపంలోని అహల్యా దేవి నర్సింగ్‌హోంలో ఆయాగా పనిచేస్తోంది. జనవరి 4వ తేదీ రాత్రి హాస్పిటల్‌కు వెళ్లింది. గుర్తుతెలియని యువకుడు వచ్చి బుజ్జమ్మతో మాటలు కలిపాడు. ఉన్నట్టుండి ఆమె మెడలోని 12 గ్రాముల బంగారు గొలుసును తెంపుకెళ్లాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు హిందీలో మాట్లాడుతున్నాడని ఆమె వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతికత ఆధారంగా నిందితుడు కొరడావీధిలోని గోల్డ్ స్మిత్ దుకాణంలో పనిచేస్తూ రాధామాధవి సెంటర్‌లో ఉంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజగౌరిగా గుర్తించారు. అతను శుక్రవారం బుజ్జమ్మ బంగారు గొలుసును విక్రయించేందుకు వెళ్తుండగా చిన్నబజారు వద్ద అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వా
ధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అయ్యప్ప, క్రైమ్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment