
కూటమి ప్రభుత్వంలో పరిశ్రమల మూత
● వైఎస్సార్‌టీయూసీ జిల్లా
అధ్యక్షుడు జయకుమార్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు): ‘కూటమి నేతలు పరిశ్రమల వద్దకు వెళ్లి దందాలు చేయడం, కమీషన్ల కోసం బెదిరింపులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. దీంతో సదరు యజమానులు పరిశ్రమలను మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది’ అని వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.జయకుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సెజ్‌లు ఏర్పాటై యువతకు ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో కూడా అనేక పరిశ్రమలు రావడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లేదని, ఎక్కడ చూసినా అవినీతి మయమైపోయిందన్నారు. నెల్లూరు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నారన్నారు. దీంతో ఇసుక కొరత ఏర్పడి భవన నిర్మాణ కార్మికులకు పనుల్లే అనేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తలేదన్నారు. అంతేకాకుండా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ అనేక కుటుంబాలను వీధిన పడేలా చేస్తోందని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇసుక మాఫియా, రౌడీయిజంపై ప్రశ్నించిన దాఖలాల్లేవన్నారు. ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో తమ యూనియన్ తరఫున పోరాటాలు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment