
No Headline
● ఉదయగిరి టీడీపీలో కాకర్ల, బొల్లినేని వర్గీయుల మధ్య విభేదాలు
● ఎమ్మెల్యే తమకు అన్యాయం చేస్తున్నారంటూ
బొల్లినేని వద్ద అనుచరుల ఆవేదన
● కాకర్లపై పార్టీ అధినేతకు బొల్లినేని ఫిర్యాదు
● లోకేశ్ అండతో డోంట్‌కేర్ అంటున్న ఎమ్మెల్యే
ఉదయగిరి: ఉదయగిరి టీడీపీలో తమ్ముళ్ల మధ్య విభేదాలు బుసలు కొడుతున్నాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు వర్గాన్ని పూర్తిగా పక్కనపెట్టే ప్రక్రియకు పదును పెట్టారు. భవిష్యత్తులో బొల్లినేని వర్గీయులు రాజకీయంగా తనను దెబ్బకొట్టే అవకాశం ఉన్నందున వారిని ఇప్పటి నుంచే పార్టీ పరంగా ప్రాధాన్యత తగ్గిస్తున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్ష హోదాలో ఉన్న బొల్లినేని నియోజకవర్గ పర్యటనకు వచ్చినపుడు ఆయనతో అనుచరులు పలువురు ఇదే విషయమై తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. పార్టీ కోసం తాము చేసిన సేవలను సైతం మరిచిపోయి కేవలం మీ అనుచరులమనే ముద్రవేసి పక్కన పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొల్లినేని శుక్రవారం వింజమూరుకు వచ్చిన నేపథ్యంలో స్థానిక పాతబస్టాండ్ వద్ద ఓ కార్యకర్త తీవ్ర స్వరంతో ఎమ్మెల్యే తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. అంతకుముందు కొండాపురం మండల నేతలు ఓ వివాహ కార్యక్రమం సందర్భంగా బొల్లినేనితో సమావేశమై పార్టీలో తమకు జరుగుతున్న అన్యాయం గురించి ఆవేదన వ్యక్తం చేసి తాడోపేడో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల నుంచి వైరం
రెండేళ్ల క్రితం కాకర్ల ట్రస్టు పేరుతో నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కాకర్ల సురేష్, నారా లోకేశ్ అనుమతితో అమెరికా నుంచి ఉదయగిరికి మకాం మార్చారు. వింజమూరు కేంద్రంగా ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టి జనాల మధ్య ఉన్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో అప్పటి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న బొల్లినేని కాకర్ల ట్రస్టు తరఫున బ్యానర్లు కూడా పెట్టనివ్వలేదు. అంతేకాకుండా నా నియోజకవర్గంలో కాకర్ల ఉనికి ఉండటానికి లేదు. అతన్ని కలవటానికి కూడా వీలు లేదని బొల్లినేని చినబాబుకు తెగేసి చెప్పారు. అయినా కాకర్ల సురేష్ కొండాపురం మండలంలో తమ ట్రస్టు తరఫున రూ.లక్షలు ఖర్చు చేసి లోకేశ్‌కు స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో రగిలిపోయిన బొల్లినేని తమ వర్గీయులు ద్వారా బ్యానర్లు తొలగించారు. కాకర్ల ట్రస్టులో పనిచేసే ఆయన అనుచరులను చితకబాది జలదంకి పోలీస్‌స్టేషన్‌లో పెట్టించారు. ఈ విషయం లోకేశ్ దృష్టికి వెళ్లడంతో కాకర్లను ఓపికగా ఉండాలి అని సముదాయించారట. పక్క నియోజకవర్గం కందుకూరుకు కాకర్ల సురేష్‌ను పిలిపించుకొని మాట్లాడారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన బొల్లినేని తమ అనుచరుల వద్ద లోకేశ్‌ను కించపరుస్తూ మాట్లాడారు. ఈ విషయం లోకేశ్ దృష్టికి వెళ్లింది. అప్పటి నుంచీ బొల్లినేనికి చెక్ పెట్టేందుకు చినబాబు పావులు కదిపారు. సురేష్‌కు ఉదయగిరి టికెట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రహస్యంగా ఉంచారు. తమను కాదని చంద్రబాబు వేరేవారికి టికెట్టు ఇవ్వరనే ధీమాతో ఉన్న బొల్లినేనికి చినబాబు షాక్ ఇస్తూ కాకర్లకు టికెట్టు ఖరారు చేశారు. దీంతో బొల్లినేని అనుచరులు కాకర్లను ఓడిస్తామని హెచ్చరించి అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. చంద్రబాబు బొల్లినేనికి అనుకూలంగా ఉన్నప్పటికీ లోకేశ్ కాకర్లను మార్చేందుకు ససేమీరా అన్నారు. చంద్రబాబు ఏమీ చేయలేక జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చి బుజ్జగించారు. బొల్లినేని ఎన్నికల సమయంలో కాకర్లను ఓడించేందుకు పావులు కదిపినా సురేష్ మాత్రం విజయం సాధించారు.
సీన్ తారుమారు
కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా గెలవడంతో బొల్లినేని అనుచరుల్లో గుబులు ప్రారంభమైంది. అప్పటికే మండల టీడీపీ కన్వీనర్లు అందరూ బొల్లినేని వర్గీయులు కావడంతో వారికి చెక్ పెట్టే క్రమంలో కొందరిని ఎమ్మెల్యే దూరంగా పెట్టారు. ఈ క్రమంలో మిగతా వారు బొల్లినేనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో కొంతమంది విజయం సాధించారు. అయితే వీరు అవకాశం దొరికితే ఎప్పుడైనా తనను దెబ్బకొట్టే అవకాశం ఉన్నదని ఎమ్మెల్యే అనుమానిస్తూనే ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో త్వరలో వారిని కూడా పక్కన పెట్టి తన సొంత టీమ్‌ను సిద్ధం చేసుకోవాలనే యోచనలో ఉన్నారని సమాచారం. తన బలం పెంచుకునేందుకు ప్రతిపక్ష పార్టీలో బలమైన క్యాడర్‌ను టీడీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తమ్మీద నియోజకవర్గంలో బొల్లినేని పేరు కనుమరుగు చేసేందుకు అన్ని అవకాశాలను ఎమ్మెల్యే సద్వినియోగం చేసుకుంటున్నారు. బ్యానర్లలో ఎక్కడా బొల్లినేని ఫొటో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారట. బొల్లినేనితో అంటకాగి గత ఎన్నికల్లో తమను ఇబ్బంది పెట్టిన వారిని పూర్తిగా పక్కన పెట్టారు. దీంతో పార్టీలో అంతర్గత విభేదాలు తమ్ముళ్ల మధ్య సెగలు రగిలిస్తున్నాయి. ఎమ్మెల్యే తీరుపై బొల్లినేని చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అయినా ఎమ్మెల్యేకు లోకేశ్ అనుగ్రహం ఉండటంతో డోంట్ కేర్ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. భవిష్యత్‌లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అనే ఆందోళన ఆ పార్టీ క్యాడర్‌లో ఉంది.

No Headline

No Headline
Comments
Please login to add a commentAdd a comment