
వీధినపడుతున్న కుటుంబాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అందుబాటులో ఉంది. మత్తు మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. నిషాలో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు నేరాలకు పాల్పడుతుంటే మరికొందరు అనారోగ్యం పాలై, కుటుంబ సమస్యలతో అర్ధాంతరంగా ఆయువు తీసుకుంటుండగా, ఇంకొందరు రోడ్డు ప్రమాదాల్లో తనువు చాలిస్తున్నారు. మత్తులో అఘాయిత్యాలకూ వెనుకాడటం లేదు.
● నెల్లూరు నగరంలో
మద్యం మత్తులో ఓ వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి యువకుడిని హత్య చేశాడు.
● మద్యం తాగేందుకు
డబ్బులివ్వలేదని తాతపై మనుమడు దాడి చేశాడు. గాయాలపాలైన వృద్ధుడు చనిపోయాడు.
● మద్యం మత్తులో గొడవపడుతున్న వారిని వారించిన ఓ యువకుడిని కొందరు హత్య చేశారు.
నెల్లూరు(క్రైమ్): గత ప్రభుత్వ హయాంలో సర్కారు మద్యం దుకాణాలు ఉండేవి. నిర్ణీత వేళల్లోనే విక్రయాలు సాగేవి. అనధికార మద్యం విక్రయాలు జరగకుండా సెబ్ పటిష్ట చర్యలు తీసుకుంది. మత్తు పదార్థాల వినియోగంపై విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో నేరాలు గణనీయంగా తగ్గాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగింది. సెబ్‌ను రద్దు చేసింది. మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం చేసింది. దీంతో జిల్లాలో 200 మద్యం దుకాణాలు ఏర్పడ్డాయి. 50కు పైగా బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. అధిక శాతం మద్యం దుకాణాలు కూటమి నేతలు, వారి అనుచరువలవి కావడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సరదాగా అలవాటైన మందు మార్కెట్‌లో సులువుగా లభ్యమవుతుండటంతో యువత బానిసలుగా మారుతోంది. చదువుకోవాల్సిన వయస్సులో బాలలు మద్యం, మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు. దుకాణాల్లో మైనర్లకు మద్యం విక్రయించకూడదనే నిబంధన ఉన్నా ఇది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ఎకై ్సజ్ అధికారులు స్పందించి విచ్చలవిడి విక్రయాలను సైతం కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కొరవడిన పర్యవేక్షణ
పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడుతుండటంతో వారు దారి తప్పుతున్నారు. పుట్టిన రోజులు, పరీక్షల్లో పాసయ్యామని, ఉద్యోగం వచ్చిందని ఇలా ప్రతి విషయంలో పార్టీల్లో సరదాగా మత్తుకు అలవాటుపడుతున్నారు. ఎంజాయ్ ముసుగులో చెడు వ్యసనాలకు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తుకు బానిసలైన వారు తమ వ్యసనాలను తీర్చుకునేందుకు సరిపడా నగదు కోసం దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. మత్తులో అఘాయిత్యాలకు వెనుకాడటం లేదు. వివాహమై సంతానం ఉన్న వారు సైతం కుటుంబ బాధ్యతలను విస్మరించి మద్యం తాగుతూ ఆరోగ్యం చెడగొట్టుకుని, అప్పుల పాలై అర్ధాంతరంగా తనువు చాలించి అయిన వారిని అగాథంలోకి నెట్టేస్తున్నారు. పోలీసులకు వివిధ కేసులతోపాటుగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడుతున్న వారిలో అధికశాతం మంది 18 నుంచి 25ఏళ్ల లోపు వారు ఉండటంతో ఆందోళన కలిగిస్తోంది. కొన్ని ఘటనల్లో బాలలు సైతం పట్టుబడుతున్నారు.
అవగాహన అవసరం
మద్యం, మత్తు పదార్థాల సేవనంతో సంభవించే దుష్ఫరిణామాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి. మరోవైపు మద్యం, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని సకాలంలో గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించడం ద్వారా ఫలితాలుంటాయని వైద్యులు పేర్కొంటున్నారు.
కూటమి ప్రభుత్వంలో
ఏరులై పారుతున్న మద్యం
బానిసలవుతున్న యువత
జీవితాలపై తీవ్ర ప్రభావం
మత్తులో నేరాలు
అవగాహనతోనే నియంత్రణ
Comments
Please login to add a commentAdd a comment