
అగ్రిగోల్డ్ అసోసియేషన్ ర్యాలీ నేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలో ర్యాలీని సోమవారం ఉదయం నిర్వహించనున్నామని అగ్రిగోల్డ్ ఏజెంట్స్, కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ కార్యదర్శి ఉప్పలపాటి రామదాసు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి ప్రదర్శనగా బయల్దేరి కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల వద్ద ధర్నాను చేపట్టనున్నామని చెప్పారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు హాజరుకానున్నారని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులు తరలిరావాలని కోరారు.
సస్పెన్షన్లో ఉన్నా..
ఎంచక్కా విధుల్లోనే!
● వింజమూరులో ఇదీ
ఉపాధి సిబ్బంది తీరు
● ఏపీఓకు వారిపై ఇంత ప్రేమ ఎందుకో?
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండలంలో సస్పెండ్ అయిన ఉపాధి హామీ పథకం ఉద్యోగులు ఎంచక్కా విధులు నిర్వహిస్తున్నారు. దర్జాగా కార్యాలయంలో తమకు కేటాయించిన కుర్చీల్లో కుర్చొని పనులు చేస్తున్నా ఏపీఓకు మాత్రం కనిపించడం లేదట. వివరాల్లోకి వెళితే.. మండలంలో ఏడాది కాలంలో జరిగిన జాతీయ ఉపాధి హామీ పనులకు సంబంధించి గత నెలలో సోషల్ ఆడిట్ జరిగింది. డ్వామా పీడీ గంగాభవాని ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఇందులో ఈసీ ఓ.రామ్మోహన్, టీఏలు సునీల్, మహేష్, సీఓ మాల్యాద్రిలు అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించారు. వీరిపై చర్యల నిమిత్తం కలెక్టర్‌కు నివేదిక పంపారు. ఈ నెల 19న వీరిని విధులు నుంచి తొలగిస్తూ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు కార్యాలయానికి వచ్చాయి. 21న సీఓ మినహా మిగితా వారు రిసీవ్ కాపీ తీసుకున్నారు. ఈ ఉత్తర్వుల్లో ఈసీకి రూ.3.15 లక్షలు, టీఏ సునీల్‌కు రూ.9.25 లక్షలు, టీఏ మహేష్‌కు రూ.3.25 లక్షలు, సీఓ మాల్యాద్రికి రూ1.25 లక్షలు రికవరీకి ఆదేశిస్తూ విధుల నుంచి తొలిగించారు. అయితే వారు జనవరి 18వ తేదీ నుంచి విధుల్లో ఉంటూ అన్ని పనులు చేస్తున్నారు. ఈ విషయమై అధికారులను అడిగితే సస్పెండ్ ఉత్తర్వులు వచ్చే వరకు విధులు నిర్వహించవచ్చని తెలిపారు. కానీ సస్పెండ్ ఆర్డర్స్ వచ్చిన తరువాత కూడా ఇప్పటికీ వారి చేత పనులు చేయించుకుంటున్నారు. వారే ఎంబుక్ రికార్డు చేస్తున్నారు. ఈసీ చెక్ మెజర్స్ చేస్తున్నారు. ఏపీఓకు వీరిపై ఇంత ప్రేమ ఎందుకో ఆయనకే తెలియాలి.
Comments
Please login to add a commentAdd a comment