
No Headline
నెల్లూరు(అర్బన్): చాలా కాలం తర్వాత నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు రెండు పేపర్లకు పరీక్షలు జరిగాయి. గంగవరంలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల, వెంకటాచలంలోని క్యూబా ఇంజినీరింగ్ కళాశాల, నెల్లూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, నారాయణ ఇంగ్లిషు మీడియం హైస్కూలు, జగన్స్ డిగ్రీ కళాశాల, శ్రీచైతన్య జూనియర్ కళాశాల, వీఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీజీ సెంటర్ తదితర 7 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. దరఖాస్తు చేసుకున్న మొత్తం 4,102 మంది అభ్యర్థులకు పరీక్షలు రాసేందుకు ఏపీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే వీరిలో ఉదయం పూట జరిగిన పరీక్షకు 3548 మంది హాజరయ్యారు. 554 మంది గైర్హాజరయ్యారు. 86.5 శాతం మంది పరీక్షలు రాశారు. మధ్యాహ్నం సెషన్‌లో 3546 మంది పరీక్షలు రాయగా మిగతా 556 మంది గైర్హాజరయ్యారు. 86.4శాతం హాజరు నమోదయింది.
ఉరుకులు.. పరుగులు
గ్రూపు–2 పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు పరీక్షలు ప్రారంభమైన చివరి నిముషంలో కొంతమంది ఉరుకులు, పరుగులతో హాజరయ్యారు. కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చారని కొంతమందిని అనుమతించలేదు. నందిపాడు గ్రామానికి చెందిన ఒక మహిళా అభ్యర్థి నెల్లూరులోని ఆమె పెద్దమ్మ ఇంటికి వచ్చింది. తర్వాత నారాయణ ఇంజినీరింగ్ కళాశాల వద్దకు వస్తూ గుర్తింపు కార్డు మరిచి పోయింది. హాల్ టికెట్‌తో పాటు ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకుని రావాల్సి ఉందని అలా గుర్తింపు కార్డు లేనందున పరీక్షా కేంద్రంలోనికి అనుమతించేది లేదని అధికారులు పేర్కొన్నారు. తాను ఏళ్ల తరబడి కష్టపడి పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యానని తనను అనుమతించాలని వేడుకున్నా అధికారులు కనికరించలేదు. దీంతో ఆమె ఏడుస్తూ వెనుదిరిగింది.
● నగరంలోని వీఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీజీ సెంటర్‌లో ఓ దివ్యాంగుడిని పోలీసులు చెక్‌చేశారు. బూట్లు విప్పి తనిఖీ చేశారు. అనంతరం పోలీసులే చేతుల మీదుగా పరీక్ష కేంద్రంలోనికి తీసుకెళ్లారు. పరీక్ష రాయడానికి వచ్చిన మరో అంధుడికి సహాయకునిగా మరో వ్యక్తిని అనుమతించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఎలాంటి లోటు పాట్లు జరగలేదని సబ్‌కలెక్టర్, గ్రూప్–2 పరీక్షల కోఆర్డినేటర్ టి.పూజ తెలిపారు.

No Headline
Comments
Please login to add a commentAdd a comment