
రాళ్లలో కలిసిపోయిన శాసనాలు
ప్రతి ఊరుకు ఓ చరిత్ర ఉంటుంది. అలాంటి ప్రాచీన చరిత్ర కలిగిందే మరుపూరు. చారిత్రక ఆనవాళ్లు చెల్లాచెదురు అవుతున్నాయి. ఆదరణ లేకపోవడంతో కాలగర్భంలో కలిసి పోతున్నాయి. అలనాటి పూర్వీకుల జీవన విధానం, సంప్రదాయాలు, సంస్కృతులను తెలియజేస్తూ అప్పటి రాచరిక ప్రభువులు ఏర్పాటు చేసిన శిలా శాసనాలు, ఆలయాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. శతాబ్దాలుగా భూగర్భంలో కలిసిపోయిన శిలాశాసనాలు అదృష్టవశాత్తు వెలుగు చూశాయి. వాటి ఆధారంగా ఇంకా మరికొంత చరిత్రను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ పురావస్తుశాఖ ఆ ప్రయత్నం చేయడం లేదు. దొరికిన ఆధారాలను భద్రపరిచి భవిష్యత్ తరాలకు చూపించే ప్రయత్నం చేయడం లేదు.
1638లోనే కాశీవిశ్వనాథస్వామి ఆలయ నిర్మాణం
● చెరువులో ప్రాచీన చరిత్ర
శాసనం లభ్యం
● అలనాటి శాసనాలు చెల్లా చెదురు
● గ్రామస్తుల చొరవతో వందల ఏళ్లనాటి ఆలయం పునర్నిర్మాణం
పొదలకూరు: శాసనాలు, కట్టడాలు చరిత్ర ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. అయితే పురావస్తుశాఖ నిధుల లేమితో నిస్తేజంగా మారడంతో చారిత్రక సాక్ష్యాలు కాల, భూగర్భంలో కలిసిపోతున్నాయి. మండలంలోని మరుపూరుకు చారిత్రక నేపథ్యం ఉంది. రాపూరు సీమను పాలించిన విజయనగర సామ్రాజ్య వంశస్తులకు సామంతు రాజులైన వెలుగోటి వంశస్తుల (వెంకటగిరి సంస్థానం) కాలంలో మరుపూరు అలనాటి పాలన, సంస్కృతి, సంప్రదాయాలకు చరిత్రగా నిలుస్తోంది. రెండేళ్ల క్రితం చరిత్రకారుడు డాక్టర్ గోవిందు సురేంద్ర ఇందుకు సంబంధించిన చారిత్రక సాక్ష్యాలను కనుగొన్నారు. గ్రామం, చెరువు, దేవస్థానం ఇప్పటికీ అలనాటి చరిత్రకు ఆధారాలుగా ఉన్నాయి. శతాబ్దాల కాలం నాటి నుంచే మరుపూరు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ నాగరికతతోపాటు అప్పట్లోనే వరి పండిస్తున్నట్లు ఆ శాసనాల్లో ఉంది. యాదృశ్ఛికంగా చరిత్రకారుడు సురేంద్ర రాతి శాసనాలను పరిశీలించడంతో గ్రామ చరిత్ర, అలనాటి పాలకుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. క్రీ.శ. 1638వ సంవత్సరం నాటి రాతి శాసనాలు చెరువుకు సమీపంలో బయల్పడ్డాయి. ప్రాచీన తెలుగు భాషలో శాసనాలు చెల్లా చెదురుగా పడి ఉండడంతో కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉంది.
దేవస్థానం పునర్నిర్మాణం
మరుపూరులో క్రీ.శ.1638లో దక్షిణాభిముఖంగా చెరువుకు సమీపంలో నిర్మించిన శ్రీకాశీవిశ్వనాథస్వామి, వరసిద్ధి వినాయకుని దేవస్థానం శిథిలావస్థకు చేరడంతో గ్రామ పెద్దలు విశిష్టత కలిగిన దేవస్థానం పునర్నిర్మాణ పనులను చేపట్టారు. దాతల సహకారంతో సుమారు రూ.1.50 కోట్ల అంచనాలతో శ్రీమల్లికార్జున కామాక్షితాయి ఆలయంగా నామకరణం చేసి నిర్మించారు. తూర్పు ముఖంతో ఆలయాన్ని నిర్మించడం వల్ల ప్రతినిత్యం సూర్యకిరణాలు గర్భగుడిని తాకుతున్నాయి. ఇది అరుదైన విషయంగా చెప్పుకుంటున్నారు.
చారిత్రక ఆధారాల కోసం పరిశోధించాలి
పురావస్తుశాఖ ఇక్కడ పరిశోధిస్తే శతాబ్దాల చారిత్రక ఆధారాలు వెలుగుచూసే అవకాశం ఉంది. అలనాటి దేవస్థానం, శాసనాల వివరాలు బయటపడతాయి. రాతి శాసనాలను భవిష్యత్ తరాలకు తెలిజేస్తూ భద్రపరచాల్సిన అవసరం ఉంది. ఆలయాన్ని భక్తులు, దాతల సహకారంతో నిర్మించాం.
– వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి,
గ్రామపెద్ద, మరుపూరు
ఎంతో విలువైన శాసనాలు
మరుపూరులో రాతి శాసనాలను గుర్తించాం. ఈ శాసనాలు ఎంతో విలువైనవిగా చెప్పుకోవచ్చు. ఇలాంటి శాసనాలు చాలానే ఉన్నాయని మేము గుర్తించాం. ఇలాగే వదిలేస్తే ఇవి కాలగర్భంలో కలిసిపోతాయి. పురావస్తుశాఖ అధికారులు స్పందించి అలనాటి శాసనాలను భద్రపరిచాల్సి ఉంది.
– జీ సురేంద్ర, చరిత్రకారుడు, నెల్లూరు
గ్రామ చెరువుకు సమీపంలో రాతి శాసనాలు చాలా కాలంగా రాళ్లలో కలిసిపోయాయి. గ్రామానికి చెందిన పెద్దలు వైస్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వళ్లూరు గోపాల్‌రెడ్డి రాళ్లలో ఉన్న శాసనాలను గుర్తించి చరిత్రకారులతో పరిశీలన చేయడంతో ఆ శాసనాల ద్వారా చరిత్ర వెలుగులోకి వచ్చింది. వెంకటపతిరాయుడి కాలంలోనే మరుపూరులో చెరువు సమీపంలో శ్రీకాశీవిశ్వనాథ, వినాయకస్వామి ఆలయాలు నిర్మించారని రాతి శాసనం ద్వారా తెలుస్తోంది. నాటి గ్రామస్తులు పండించే పంటలో మేర భాగం అందజేయాలని కాపు, కరణం ఆదేశాలు ఇస్తున్నట్టుగా శాసనం ఉన్నందున రాతి శాసనాన్ని ధానధర్మ శాసనంగా వ్యవహరించే వారని తెలుస్తోంది. ఇదే అంశాన్ని మైసూరు పురావస్తు శాసన పరిశోధకుడు డాక్టర్ మునిరత్నంరెడ్డి ధ్రువీకరించినట్లు గ్రామ పెద్దలు వెల్లడించారు.

రాళ్లలో కలిసిపోయిన శాసనాలు

రాళ్లలో కలిసిపోయిన శాసనాలు

రాళ్లలో కలిసిపోయిన శాసనాలు

రాళ్లలో కలిసిపోయిన శాసనాలు
Comments
Please login to add a commentAdd a comment