
రైతులు నిండా మునిగిపోతున్నారు..
● టీడీపీ నేతతోపాటు అన్నదాతల ఆవేదన
కోవూరు: రైతులందరూ నిండా మునిగిపోతున్నారు. గత సీజన్‌లో నాలుగు పుట్లు దిగుబడి వస్తే ఇప్పుడు మూడు పుట్లు మాత్రమే వచ్చింది. గత సీజన్‌లో పుట్టి రూ.24 వేలకు అమ్మితే.. ఇప్పుడు పుట్టి రూ.15,200 కూడా కొనడం లేదు. ఓ టీడీపీ నేత జిల్లా వ్యవసాయశాఖాధికారిణి సత్యవాణిని నిలదీశాడు. మండలంలోని పాటూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఏఓ సత్యవాణి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ టీడీపీ నేత లక్ష్మీశెట్టి శీనయ్య మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో పట్టలు లేవని, ధాన్యాన్ని ఆరబెడితే వర్షం వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు మీటింగ్ పెట్టి ప్రభుత్వ మద్దతు ధర రావాలంటే తేమ శాతం వస్తేనే కొలుస్తామన్నారు. ఇదేం సమాధానం. ఎకరానికి రూ.30 వేలు నష్టపోతున్నాం.. ఈ నష్టం డబ్బులెవరిస్తారు. పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ క్వింటాకు రూ.300 ఎక్కువ ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారంటూ నిలదీశారు. నిర్దిష్ట తేమ శాతం రావాలంటే.. ఇంకా పది రోజులు ఆరబోయమంటున్నారు. ఎక్కడ ఆరబోయాలి. పట్టలిచ్చారా? కల్లాలిచ్చారా? ఎక్కడ ఆరబోయాలంటూ ప్రశ్నించారు. దీంతో ఆమె ఏదో సర్దిచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పడుగుపాడు సొసైటీని కార్యాలయాన్ని రైతులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక ఎకరానికి సాగు ఖర్చులు రూ.40 వేలు అవుతుంటే.. పుట్టి ధాన్యం రూ.15 వేలకు కూడా మిల్లర్లు కొనడం లేదని, ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీనియర్ నాయకురాలు జక్కా శేషమ్మ, రైతు సంఘం నాయకుడు ఎం. వెంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.పుల్లయ్య, జి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment