
No Headline
ఉదయగిరి: అక్రమార్కులకు జామాయిల్ చెట్లు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. అటవీ సందపను యథేచ్ఛగా కొల్లగొడుతూ.. గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నా, చోద్యం చూడటం అధికారుల వంతవుతోంది. అక్రమార్కులకు వీరు పరోక్ష సహకారం అందిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు.
వేలాది ఎకరాల్లో పెంపకం
ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల పరిధిలో అటవీ శాఖకు చెందిన భూముల్లో వేలాది ఎకరాల్లో జామాయిల్ తోటలను స్థానిక వీఎస్సెస్‌ల ఆధ్వర్యంలో పదేళ్లుగా పెంచుతున్నారు. జామాయిల్ కర్ర సైజ్ బాగా పెరిగింది. రెండేళ్లుగా దీని ధర ఎక్కువగా ఉండటంతో కొంతమంది అక్రమార్కుల కన్నుపడింది. నందిపాడు, వరికుంటపాడు బీట్ పరిధిలోని కొన్ని ప్లాంటేషన్లలో జామాయిల్‌ను గుట్టుచప్పుడు కాకుండా నరికి కర్మాగారాలకు తరలించి రూ.లక్షలను ఆర్జిస్తున్నారు.
అక్రమార్కులతో మిలాఖత్
గతంలో పనిచేసిన రేంజర్ స్థాయి అధికారి, సిబ్బంది.. అక్రమార్కులతో కలిసి రూ.50 లక్షల విలువజేసే జామాయిల్ కర్రను స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. టెండర్ల ప్రక్రియలో కటింగ్ చేసిన జామాయిల్ కర్రలో ఈ అక్రమాలు జరిగాయనే ప్రచారం సాగుతోంది. ప్లాంటేషన్లలోని కర్రలో కొంతమేర టెండర్‌దారుడికి విక్రయించి మిగిలిన మొత్తాన్ని విడిగా తరలించి అక్రమార్జనకు తెరలేపారని తెలుస్తోంది.
ఇంటి దొంగల పాత్రతో మౌనం
ఇంటి దొంగల పాత్ర ఉండటంతో ఎలాంటి చర్యలు చేపట్టకుండా మౌనం వహించారు. భారీ మొత్తంలో చేతులు మారడంతో బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచారనే ఆరోపణలున్నాయి. రామాపు రం, కాంచెరువు, డక్కునూరు అటవీ భూముల్లో విలువైన క్వార్ట్‌జ్ (తెల్లరాయి), పల్సర్ ఖనిజ సంపదను రాత్రి వేళ పెకిలించి ట్రాక్టర్ల ద్వారా వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ తంతులోనూ అటవీ సిబ్బంది పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విజిలెన్స్, సీఐడీ విచారణే దిక్కు
ఉదయగిరి రేంజ్ పరిధిలో సాగుతున్న ఈ అక్రమాలు వెలుగులోకి రావాలంటే విజిలెన్స్ లేదా సీఐడీ అధికారులతో విచారణ చేయించాలని స్థానిక వీఎస్సెస్ కమిటీల సభ్యులు కోరుతున్నారు. కమిటీ సభ్యుల్లో కొందరి పాత్ర ఉందని వారే అంగీకరిస్తున్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రూ.కోట్ల విలువజేసే అటవీ సంపదను అక్రమార్కులు భవిష్యత్తులో దోచేసే అవకాశం ఉంది. ఈ విషయమై ఉదయగిరి రేంజ్ అటవీ అధికారి కుమారరాజాను సంప్రదించేందుకు ఫోన్లో యత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
ముడుపులతో మభ్యపెట్టి
నందిపాడు బీట్‌లో జరిగిన ఈ వ్యవహారాన్ని స్థానిక వీఎస్సెస్ కమిటీ గుర్తించింది. గుట్టురట్టు చేస్తామని బెదిరించడంతో రూ.నాలుగు లక్షలిచ్చి నోరు మూయించారని సమాచారం. మరోవైపు వరికుంటపాడు బీట్ పరిధిలోని రామదేవులపాడు అటవీ భూముల్లో సైతం సుమారు రూ.50 లక్షల విలువజేసే జామాయిల్ కర్రను మాయం చేశారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ప్రస్తుత అధికారులు తమ సిబ్బందితో కలిసి విచారణ జరిపించగా, వ్యవహారం వాస్తవమేనని తేలింది.
అటవీ సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతూ..
రూ.లక్షల విలువజేసే చెట్ల నరికివేత
గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు
అక్రమార్కులతో ఇంటి దొంగల కుమ్మక్కు
వీఎస్సెస్ కమిటీల ఆందోళన

No Headline
Comments
Please login to add a commentAdd a comment