
No Headline
● చట్టానికి తూట్లు..
ఇష్టారాజ్యంగా నంబర్ ప్లేట్లు
● జిల్లాలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలు
● హోరెత్తిస్తున్న హారన్‌లు, ఎల్‌ఈడీ లైట్లు
● యథేచ్ఛగా
వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్
● వాహనాల్లోనే
అసాంఘిక కార్యకలాపాలు
● చోద్యం చూస్తున్న
జిల్లా రవాణాశాఖ, పోలీసులు
నెల్లూరు (టౌన్): జిల్లాలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ నేతలు, అధికారులు రవాణాశాఖ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు వినియోగిస్తున్న వాహనాలను రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్నారు. మమ్మల్ని అడిగే దమ్ము, ధైర్యం ఎవరికుంది అనుకున్నారో తెలియదు కానీ రవాణా శాఖ నిబంధనలు అతిక్రమిస్తూ ప్రవర్తిస్తున్నారు. జిల్లా రవాణాశాఖలో రిజిస్ట్రేషన్ కలిగిన 7 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిల్లో 5 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు, లక్షకు పైగా నాలుగు చక్రాల వాహ నాలు, 40 వేలకు పైగా ఆటోలు, 10 వేలకు పైగా లారీలు, మిగిలినవి కాంట్రాక్ట్, స్టేజీ క్యారియర్ బస్సు లు, ట్రాక్టర్లు, మినీ వాహనాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర రాష్ట్రాల వాహనాలు కూడా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల వాహనాలు జిల్లాలో తిరగడం రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధం.
విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాల వాహనాలు
ఇతర రాష్ట్రాల బైక్‌లు, కార్లు, లారీలు జిల్లాలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల వాహనాలు జిల్లాకు వస్తే నెలకు మించి ఇక్కడ తిప్పడానికి వీల్లేదు. ఆపై ఇక్కడే తిరుగుతుంటే.. అటువంటి వాహనాలపై కేసు నమోదు చేయొచ్చు. చాలా మంది ఇతర రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేసి జిల్లాలో తిప్పుతున్నారు. ఇటువంటి వాహనాలను కొనుగోలు చేస్తే ఏపీ మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మోడల్‌ను బట్టి వాహన జీవిత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోని కొంత మంది వాహనదారులు తమ వాహనాలను యథేచ్ఛగా తిప్పుతూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు.
ఎమ్మెల్యే తాలూకా నంబర్ ప్లేట్లు
వాహనానికి హైసెక్యురిటీ నంబరు ప్లేట్లను మాత్రమే బిగించాలి. ఆ నంబరు ప్లేటు మీద ఎలాంటి రాతలు, పేర్లు ఉండకూడదు. అయితే జిల్లాలో కొత్త సంస్కృతి నడుస్తోంది. పూర్తిగా నంబర్ ప్లేట్లు తొలగించి.. ఆ స్థానంలో పలానా ఎమ్మెల్యే తాలూకా, డీసీఎం తాలూకా అంటూ రాజకీయ పార్టీల గుర్తులు, పేర్లలో స్టిక్కర్లు వేసుకుని విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నేరస్తులు కొందరు ఈ తరహా స్టిక్కర్లతో వాహనాల్లో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. చైన్ స్నాచింగ్‌లు, ఇతర నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో నేరస్తుల జాడ గుర్తించడం కూడా కష్టమవుతోంది. రవాణా శాఖతోపాటు ట్రాఫి క్ పోలీసుల కళ్ల ముందే ఇలాంటి వాహనాలు వెళ్తున్నా.. కనీసం ఆ వాహనాన్ని ఆపే దమ్ము, ధైర్యం చేయలేకపోతున్నారు. ఇంకొందరైతే ప్రెస్ స్టిక్కర్లు వేసుకు ని తిరుగుతున్నారు. అస లు సిసలైన జర్నలిస్టులు ఎవరూ ప్రత్యేకంగా ఇ లాంటి స్టిక్కర్లు వేసు కోరు. ఇటువంటి జర్న లిస్టులకు కలెక్టర్ జారీ చేసిన అక్రిడెటేషన్ కార్డులు ఉంటాయి. ఇందుకు భిన్నంగా ప్రెస్ స్టిక్కర్ కనబడితే ఎవరూ అడగరనే ధీమాతో పెద్దపెద్ద అక్షరాల్లో స్టికర్లు వేసుకుంటున్నారు. కొందరు నంబరు ప్లేటుపై ప్రభుత్వ వెహికల్, అధికారి హోదాతో మరో పెద్ద బోర్డు బిగించడం వంటివి చేస్తున్నారు.
హారన్ల మోతతో
సౌండ్ పొల్యూషన్
వాహనాలతోపాటు వచ్చే హారన్లను తొలగించి.. అత్యధిక సౌండ్ వచ్చే హారన్లను బిగిస్తున్నారు. ట్రాఫిక్ ఉన్నప్పుడు, టోల్‌గేట్లు, చెక్‌పోస్టుల తదితర వాటి దగ్గర యథేచ్ఛగా హారన్లను మోగిస్తున్నారు. వీటి మోతతో ముందు వెళ్తున్న వాహనచోదకులు తత్తరపాటుకు గురై ప్రమాదాలకు లోనవుతున్నారు.
చీకటి మాటున
అసాంఘిక పనులు
వాహనాలను వాటి యజమాను లు ఇష్టారాజ్యంగా మలచుకుంటున్నా రు. వాహనంతో పాటు వచ్చిన హెడ్‌లైట్లను తీసివేసి హైఓల్టేజీ లైట్లు బిగిస్తున్నారు. రాత్రి వేళల్లో ఎదురుగా వస్తున్న వాహన డ్రైవర్లకు రహదారి స్పష్టంగా కనిపించదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తున్నారు. కంపెనీ నుంచి వచ్చిన కారు లోపల ఎవరున్నారన్న దానిపై స్పష్టంగా ఉండాలి. అయితే ఆ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ బిగించి రోడ్డు పక్కన ఆపేసి ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు.
కారు అద్దాలకు ఏర్పాటు చేసిన బ్లాక్ ఫిల్మ్
హైసెక్యూరిటీ ప్లేట్ల స్థానంలో పలు రకాల స్టిక్కర్లు
వాహన చట్టాన్ని రూపొందించే పాలకులు, అధికారులే.. ఆ చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. జిల్లాలో రవాణా, పోలీస్‌శాఖలు పూర్తిగా చతికిల పడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా గతంలో ఎన్నడూ లేని కొత్త సంస్కృతి వాహనాల నంబర్ ప్లేట్లపై కనిపిస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలు సైతం ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను జిల్లాలో తిప్పుతున్నారు. కార్లతోపాటు టెంపో అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ చీకటి మాటున వాహనాల్లోనే అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు.
చోద్యం చూస్తున్న రవాణా శాఖ అధికారులు
రవాణా నిబంధనలు అతిక్రమించి వాహనాలను యథేచ్ఛగా తిప్పుతున్నా.. జిల్లా రవాణా శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇలాంటి వాహనాల జోలికి వెళ్లడం లేదు. హెల్మెట్ లేదనో, లైసెన్స్ లేదనో ద్విచక్ర వాహనదారులపైన, ఎక్కువ మందిని ఎక్కించుకున్నారంటూ ఆటో వాలాలపైన కేసులు నమోదు చేస్తున్న రవాణా శాఖాధికారులు నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

No Headline

No Headline

No Headline
Comments
Please login to add a commentAdd a comment