
తీరానికి కోత..
సముద్ర తీరంలో ఇసుకను అక్రమంగా తరలించడంతో ఇసుక దిబ్బలు చదునుగా మారిన దృశ్యం
అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు ప్రకృతి వినాశానికి పాల్పడుతున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్‌లో పెను ముప్పునకు దారితీయనున్నాయి. వాతావరణ విపత్తు తలెత్తినప్పుడు తీరంలోనే ఎగిసిపడే అలలు.. గ్రామాలకు గ్రామాలను ముంచెత్తే ప్రమాదాలు లేకపోలేదు. తీరానికి కోత పెడుతూ సాగిస్తున్న ఇసుక దందా మున్ముందు గుండె కోతలను మిగల్చనుంది. ఇప్పటి వరకు నదులు, కాలువలు, వాగుల్లో ఇసుకను కొల్లగొట్టిన అక్రమార్కులు ఇప్పుడు సముద్ర ఇసుకపై పడ్డారు.
కావలి: ఇసుకాసురుల బరి తెగింపు.. తీర ప్రాంత గ్రామాలకు పెను ముప్పుగా పరిణమించనుంది. అక్రమార్జనే ధ్యేయంగా అధికార పార్టీ అండతో కొందరు సముద్ర ఇసుక దందాకు పాల్పడుతున్నారు. కావలి మండలం అన్నగారిపాళెం, బోగోలు మండలం జువ్వలదిన్నె పంచాయతీ పరిధిలోని సముద్ర తీరంలో ఉన్న ఉప్పు ఇసుకను అక్రమార్కులు కొంత కాలంగా యథేచ్ఛగా తరలిస్తున్నారు. సముద్రం అంచున ఉండే ఇసుకను జేసీబీలు పెట్టి టిప్పర్లతో రేయింబవళ్లు తరలిస్తున్నారు. సముద్ర తీరానికి, గ్రామాల మధ్య రక్షణగా ఇసుక కట్టలు (చెలియ కట్టలు), మడ అడవులు ఉండేవి. కాలక్రమంలో మడ చెట్లు అంతరించిపోవడంతో ఇసుక దిబ్బలే రక్షణ గోడగా నిలుస్తున్నాయి.
ఊర్లకు ఊర్లే కొట్టుకుపోతాయి
ప్రకృతి, వాతావరణంలో మార్పుల కారణంగా సముద్రంలో అల్పపీడన ద్రోణి, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడినప్పుడు తరచూ సముద్రం సాధారణ పరిస్థితి కంటే 50 నుంచి వంద అడుగుల మేర ముందుకు చొచ్చుకు వస్తు న్న పరిణామాలను గమనిస్తున్నాం. సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చినప్పుడు ఈ ఇసుక కట్టలే రక్షణగా ఉంటున్నాయి. సుమారు 20 ఏళ్ల క్రితం వచ్చిన సునామీ సమయంలో చాలా చోట్ల అనేక గ్రామాలను ఈ ఇసుక దిబ్బలే కాపాడాయి. ప్రస్తుతం అక్రమార్కులు సముద్రం అంచున ఉన్న ఇసుకను తరలించడంతో తీరానికి, గ్రామాలకు మధ్య రక్షణగా ఉండే ఇసుక కట్టలు లేకుండాపోతున్నాయి. ఈ పరిణామాలతో భవిష్యత్‌లో ఇంతకంటే ఎక్కువ స్థాయిలో అలల ఉధృతి పెరిగితే నేరుగా అలలు తీర ప్రాంతాల్లోని ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందని స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సముద్రం ఒడ్డున ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తున్నా.. మత్స్యశాఖ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, సచివాలయ అధికారులు, సిబ్బంది కళ్లు మూసుకుని తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సముద్రపు ఇసుక తరలింపు ప్రమాదకరం
కావలి ప్రాంతంలోని సముద్ర తీరప్రాంతం నుంచి ఇసుకను జేసీబీల సహాయంతో టిప్పర్ల ద్వారా విచ్చలవిడిగా తరలిస్తున్నారని, ఇది ప్రమాదకరమ ని జాతీయ మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు పోన్నపూడి తాతారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఒ.ఆనంద్ వినతిపత్రం అందజేశారు. ఇసుక తవ్వకాలతో భవిష్యత్‌లో అలలు గ్రామాలను ముంచెత్తే అవకాశం లేక పోలేదని పేర్కొన్నారు. ఈ ఇసుకను ఎక్కడికి తరలిస్తున్నారో తెలియడం లేదు. ఆ ఇసుకతో సాగించే నిర్మాణాలకు భద్రత ఉండదు. ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్న వ్యవహారంపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అక్రమార్కుల బరితెగింపు
సముద్ర ఇసుక అక్రమ రవాణా
భవిష్యత్‌లో గ్రామాలను
ముంచనున్న అలలు

తీరానికి కోత..
Comments
Please login to add a commentAdd a comment