
వీఎస్‌యూకు ఎన్‌ఐఓటీ బృందం
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమసింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)ని జాతీయ మహా సముద్ర సాంకేతిక సంస్థ (ఎన్‌ఐఓటీ) చైన్నె ప్రతినిధులు డాక్టర్ ఎన్‌వీ వినీత్, డాక్టర్ సచ్చితానందనం, డాక్టర్ ఎన్‌వీఎస్ దేవిరాం సోమవారం సందర్శించారు. వీఎస్‌యూలో మైరెన్ బయోలజీ విభాగం అచార్యులు, పరిశోధకులతో సమావేశమై సముద్ర జీవ వైవిధ్యం, ఉప్పు నీటి పరిశోధనలపై వివిధ అంశాలను చర్చించారు. ల్యాబ్‌లు, తరగతి గదులు, మ్యూజియం సందర్శించి పరిశోధనలపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీతతో సమావేశమై సముద్ర జీవ పరిసరాల అధ్యయనంలో పరిశోధనలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత, జాతీయ స్థాయి సంస్థలతో అనుసంధానంపై చర్చించారు.
ప్రాణహాని ఉందని
ఎస్పీకి ఫిర్యాదు
వరికుంటపాడు: మండలంలోని తోటల చెరువుపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పులి వెంకటప్రసాద్ తనకు తమ గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత డి.మౌలాలి నుంచి ప్రాణహాని ఉందని సోమవారం నెల్లూరులో ఎస్పీ కృష్ణకాంత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నెల 17వ తేదీన కుటుంబ ఆస్తి విషయమై జరిగిన గొడవలో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. టీడీపీ నేత మౌలాలి జోక్యం చేసుకొని తమపై దాడికి పాల్పడ్డాడని, పోలీసులు సైతం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, తమ పైనే కేసు నమోదు చేశారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. పూర్తిస్ధాయిలో విచారించి న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారని బాధితుడు తెలిపారు.
ఆక్రమణలన్నీ
తొలగించాల్సిందే
రాపూరు : మండలంలోని కండలేరు జలాశయం భూమిని పలువురు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని, అయితే ఇందులో కొంత మందికే రెవెన్యూ అధికారులు ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినారని రాంబాబు, శేషుబాబు, వెంకటాద్రి ఆరోపించారు. ఆక్రమణలు తొలగించాల్సి వస్తే.. అందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు. కండలేరు జలాశయానికి సంబంధించి 200 ఎకరాల భూమిని ఆ ప్రాంతంలోని పలువురు ఆక్రమించుకుని అనేక ఏళ్లు సాగు చేసుకుంటున్నారు. అందులో అధికార పార్టీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. సదరు వ్యక్తి తన తోటకు వెళ్లేందుకు దారి కోసం అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తేవడంతోనే తమకు నోటీసులు ఇచ్చారని, ఇది ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కొంత మందిపై వివక్ష చూపడం ఏమిటని నిలదీశారు. తహసీల్దార్ లక్ష్మీనరసింహం మాట్లాడుతూ ఆ ప్రాంత ప్రజల ఫిర్యాదు ఇచ్చారని, ఆ మేరకు ఆక్రమణలో ఉన్న అన్ని భూములను ఖాళీ చేయిస్తామని తెలిపారు.
బైక్ ఢీకొని
మేకల కాపరి మృతి
కోవూరు: మేకల కాపరిని వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. కోవూరు మండలం వేగూరుకు చెందిన గంధళ్ల శీనయ్య (59) మేకలు మేపుకుంటూ జీవనాధారం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మేకలు తోలుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, వేగూరు–మోడేగుంట మార్గంలో మోడేగుంట నుంచి వేగూరుకు వస్తున్న బైకిస్టు అతివేగంగా వెనుక నుంచి వచ్చి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శీనయ్యను స్థానికులు చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తున్న క్రమంలో సోమవారం మార్గంమధ్యలోనే అంబులెన్స్‌లోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై రంగనాథ్, ట్రెయినీ డీఎస్పీ శివప్రియ సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. శీనయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment