
గంజాయి అక్రమ రవాణాదారుడి అరెస్ట్
● 10 కేజీల గంజాయి స్వాధీనం
నెల్లూరు (క్రైమ్): గంజాయి అక్రమ రవాణాదారుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 10 కేజీల గంజాయిని సోమవారం రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు రైల్వే పోలీసుస్టేషన్‌లో రైల్వే సీఐ కె. భుజంగరావు నిందితుడి వివరాలను వెల్లడించారు. నేరనియంత్రణ చర్యల్లో భాగంగా రైల్వే పోలీసులు రైళ్లు, రైల్వేస్టేషన్లలో నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోమవారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో తనిఖీ చేస్తుండగా, రెండు, మూడో ప్లాట్‌ఫాంల మధ్యలో అనుమానాస్పదంగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా బురుగుబయలు గ్రామానికి చెందిన పి. సన్యాసిరావును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా రెండు కేజీల బరువు కలిగిన ఐదు గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రైల్వే పోలీసుస్టేషన్‌కు తరలించి విచారించగా బెంగళూరు, చైన్నెల్లోని వ్యక్తులకు ఇచ్చేందుకు వెళుతున్నామని చెప్పారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి గంజాయిని సీజ్ చేశారు. నిందితుడిపై రంపచోడవరంలో గంజాయి కేసు ఉందని సీఐ చెప్పారు. వేసవి సమీపిస్తున్న దృష్ట్యా నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్‌ఐ మాలకొండయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment