రుస్తుంపై రుబాబు | - | Sakshi
Sakshi News home page

రుస్తుంపై రుబాబు

Published Wed, Feb 26 2025 7:24 AM | Last Updated on Wed, Feb 26 2025 7:19 AM

రుస్తుంపై రుబాబు

రుస్తుంపై రుబాబు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం దాష్టీకానికి పొదలకూరు మండలంలోని తాటిపర్తిలో ఉన్న ‘రుస్తుం’ మైన్స్‌పై నమోదు చేసిన తప్పుడు కేసు అద్దం పడుతోంది. స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేస్తున్న ఇసుక దోపిడీ వ్యవహరం బట్టబయలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దూమారం రేగుతోంది. ఈ విషయాన్ని డైవర్ట్‌ చేయడానికి దాదాపు 14 నెలల క్రితం తానిచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలంటూ మైనింగ్‌శాఖపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

రుస్తుంపై తప్పుడు కేసు

జిల్లాలో అధికార యంత్రాంగం వాస్తవాలను పక్కన పెట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఊడిగం చేస్తోంది. ఎమ్మెల్యేలు ప్రేరేపించిన రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల తలొగ్గి.. మైనింగ్‌ శాఖాధికారులు ఆఖరికి తమ శాఖనే కించపరుస్తున్నారు. ఎమ్మెల్యేలు చెప్పారని.. అధికారులు వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు. తాజాగా పొదలకూరు మండంలంలోని తాటిపర్తిలో ఉన్న ‘రుస్తుం’ మైన్స్‌లో అక్రమ మైనింగ్‌ జరిగిందంటూ గనుల శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండానే అధికార పార్టీ ఒత్తిళ్లతో ఆగమేఘాలపై కేసు నమోదు చేశారు.

మైనింగ్‌శాఖ క్లీన్‌చిట్‌ ఇస్తే..

పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సర్వే నంబర్లు 697, 699,751/2, 759/1, 759/2, 924, 925ల్లోని ప్రభుత్వ భూముల్లో 32.71 ఎకరాల విస్తీర్ణంలో రుస్తుం మైనింగ్‌కు 2016 ఏప్రిల్‌ వరకు అనుమతి ఉంది. లీజు గడువు పూర్తికావడంతో యజమాని సైతం దాన్ని వదిలేశారు. అక్కడ మైనింగ్‌ వ్యవహారాలు కూడా జరగడంలేదు. అయితే 2023 డిసెంబర్‌లో అక్కడ అక్రమ మైనింగ్‌ జరుగుతోందని సోమిరెడ్డి మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు మైనింగ్‌ అధికారులు జాయింట్‌ తనిఖీ నిర్వహించారు. ఆ మైన్స్‌లో అక్రమ మైనింగే జరగలేదని, ఆ ప్రాంతంలో ఫెల్డ్‌ స్పార్‌, క్వార్ట్జ్‌ మిశ్రమం కలిసిన పాత నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడ యంత్రాలు పెట్టి తవ్వకాలు చేసిన ఆనవాళ్లు సైతం కనిపించలేదు. రెండు శాశ్వత భవనాలు సైతం పాడుబడినవి ఉన్నట్లు గుర్తించి ఆ మేరకు నివేదిక ఇచ్చారు. ఆపై రెండు నెలల వ్యవధిలోనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం, ప్రభుత్వం మారింది. అసలు ఆ మైన్స్‌లో ఎక్కడా అక్రమాలు జరగలేదని నిర్ధారించి నివేదిక ఇచ్చిన ఆ శాఖ అధికారులే ప్రభుత్వం మారిన తొమ్మిది నెలలకు అక్రమ మైనింగ్‌ జరిగిందంటూ పోలీసు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో గనుల శాఖ అధికారులు న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడక తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా అధికార పార్టీ రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఏ తప్పు జరగకపోయినా.. తప్పుడు కేసులు పెట్టి వేధించడమే పనిగా వ్యవహరిస్తున్నారు. సోమిరెడ్డి ఇసుక దోపిడీ వ్యవహారంపై దుమారం రేగడంతో ఆ విషయాన్ని డైవర్ట్‌ చేయడం కోసం తాజాగా ‘క్లీన్‌చిట్‌’ ఉన్న ‘రుస్తుం’ మైన్స్‌పై ఏడాది తర్వాత తెరపైకి తెచ్చి రు‘బాబు’ చేస్తున్నారు. మైనింగ్‌ శాఖ జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌ అక్కడ అక్రమ మైనింగ్‌ జరగలేదని చెబితే.. అదే శాఖ ఇప్పుడు అక్రమ మైనింగ్‌ జరిగిందంటూ తప్పుడు కేసు పెట్టడం చూస్తే అధికార పార్టీ దాష్టీకానికి నిదర్శనంగా నిలుస్తోంది.

రెడ్‌బుక్‌ కుట్రతోనే గనుల శాఖ డీడీ కేసు నమోదు

2023 డిసెంబర్‌లో సోమిరెడ్డి ఫిర్యాదుపై మైనింగ్‌ శాఖ జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌

అక్రమ మైనింగ్‌ జరగలేదంటూ నివేదిక

ఇప్పుడు ఆ శాఖ అధికారులే ప్లేటు ఫిరాయించి తప్పుడు కేసులు

సోమిరెడ్డి ఇసుక దోపిడీ బయటకు రావడంతో డైవర్షన్‌ రాజకీయం

రెడ్‌బుక్‌ కుట్రతోనే..

ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతి, అక్రమాలపై నిత్యం ప్రశ్నిస్తున్న మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని టార్గెట్‌ చేసి అక్రమ కేసుల్లో ఇరికించేందుకు అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎక్కడా అవినీతి జరిగినట్లు రుజువులు లేకపోవడంతో ‘రుస్తుం’ మైన్స్‌లో ఆయన్ను ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలు ప్రారంభించారు. మైనింగ్‌ అధికారులు తొమ్మిది నెలల తర్వాత పొదలకూరు స్టేషన్‌లో రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌ జరిగిందంటూ అందులో పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులరెడ్డితోపాటు మరికొందరు అంటూ మైనింగ్‌ డీడీ బాలాజీనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు రెడ్‌బుక్‌ కుట్రలో భాగంగానే జరిగిందని, అత్సుత్సాహం చూపే అధికారులు తప్పక శిక్ష అనుభవించక తప్పదని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement