
వేరుశనగ సాగు.. అంతంతమాత్రం
పొదలకూరు: వేరుశనగ సాగులో జిల్లా వెనుకబడి ఉంది. కేవలం 900 హెక్టార్లలోనే పండిస్తున్నారు. ఈ విస్తీర్ణాన్ని పెంపునకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వాస్తవానికి నూనెగింజల సాగు మన దేశంలో తక్కువ. వంట నూనెలకు సంబంధించి 60 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులున్నాయి. 70 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న దేశంలోని రైతులు నూనెగింజల సాగుపై మాత్రం మొగ్గు చూపడం లేదు. ప్రధానంగా పామాయిల్, వేరుశనగ, పొద్దుతిరుగుడు తదితర వాటికి సంబంంధించి ఓ ప్రాంతం లేదా ఒక రాష్ట్రం వరకే పరిమితమవుతున్నారు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో నూనెగింజలను పండిస్తే విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదనేది వ్యవసాయ శాస్త్రవేత్తల అభిప్రాయం. నూనె గింజల సాగులో ప్రధానమైన వేరుశనగ విస్తీర్ణం జిల్లాలో పెరగడం లేదు. అనంతపురం జిల్లాలో బాగుంది. సత్యసాయి జిల్లాలో ఉన్న కదిరి వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆరు రకాల విత్తనాలను రూపొందించారు.
అవగాహన లేక..
జిల్లాలో వేరుశనగ సాగుపై రైతులకు అవగాహన లేకపోవడం వల్ల విస్తీర్ణం పెరగడం లేదని తెలుస్తోంది. విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే ఎకరాకు 30 బస్తాల వరకు దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు అంటున్నారు. సాధరణంగా వేరుశనగలో నూనె శాతం అధికంగా ఉంటుంది. వంట నూనెను వీటి నుంచే తీయడం తెలిసిందే. ఇసుక నేలల్లో అధికంగా పండిస్తారు. కదిరి లేపాక్షి 1812 రకం సాగు చేస్తే రైతులకు గిట్టుబాటు అవుతున్నట్టు తెలుస్తోంది. కదిరి పరిశోధన స్థానం కనుగొన్న ఆ రకాన్ని తెలంగాణ, మన రాష్ట్రంలోని రైతులు సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండే రాయలసీమలో సైతం ఈ రకం సాగువుతున్నట్టు వ్యవసాయాధికారులు వెల్లడించారు. చీడపీడలు తక్కువగా ఉంటాయని, ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెడితే 30 బస్తాలకు పైబడి దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంది. ఒక్కో మొక్కకు 100 నుంచి 150 కాయలు కాస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వేరుశనగ పంటకు సంబంధించి టీఎస్‌జీఎస్ 1707 (ఐసీఏఆర్ – కోణార్క్) స్పానిష్ బంచ్, నంద్యాల గ్రామ్ (ఎల్‌బీఈజీ 1267) రకాలు ఏపీలో అనుకూలంగా ఉంటాయని సూచించింది.
ఇక్కడిలా..
పొదలకూరులో చిరుధాన్య పరిశోధన స్థానం ఉంది. ఇక్కడికి ప్రధాన శాస్త్రవేత్తగా ప్రసన్న రాజేష్ కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఇక్కడకు వచ్చారు. ఆయన వేరుశనగ పంటపై అనేక పరిశోధనలు చేశారు. జిల్లాలో విస్తీర్ణం పెంపొందించేందుకు కృషి చేస్తానంటున్నారు. రైతులు ముందుకొస్తే పంటల మార్పిడికి కూడా ఊతం ఇచ్చినట్టవుతుంది. పొదలకూరు మండలంలోని కొనగలూరు, నల్లపాళెం, సూరాయపాళెం తదితర గ్రామాల్లో స్వల్పంగా వేరుశనగను పండిస్తున్నారు.
వేరుశనగ పంట (ఫైల్)
జిల్లాలో కేవలం 900 హెక్టార్లలోనే..
విస్తీర్ణం పెంపునకు
శాస్త్రవేత్తల కృషి
కదిరి లేపాక్షి రకం విత్తనం
మేలంటున్న శాస్త్రవేత్తలు
పొదలకూరు చిరుధాన్య పరిశోధన స్థానం నుంచి అవగాహన

వేరుశనగ సాగు.. అంతంతమాత్రం
Comments
Please login to add a commentAdd a comment