
ఇంటర్ పరీక్షలకు వేళాయె
ఇంటర్ పరీక్షలకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. శనివారం నుంచి మార్చి 20 వరకు వీటిని నిర్వహించనున్నారు. జంబ్లింగ్ పద్ధతిలో జరిపేందుకు చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి లైవ్ స్ట్రీమింగ్‌ను రాష్ట్ర, జిల్లా ఇంటర్ బోర్డు కార్యాలయాలకు అనుసంధానం చేశారు.
నెల్లూరు (టౌన్): ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా 28 ప్రభుత్వ, 51 ప్రైవేట్.. మొత్తం 79 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 53,200 మంది హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సర జనరల్ విద్యార్థులు 26,931, ఒకేషనల్ 1,245 మంది కలిపి 28,176.. ద్వితీయ సంవత్సర జనరల్ 23,994 మంది, ఒకేషనల్ 1,030 మంది కలిపి 25,024 మంది ఉన్నారు. వీరిలో 326 మంది ప్రత్యేకావసరాల విద్యార్థులు ఉన్నారు. వీరి అవసరాల మేరకు స్క్రైబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ఇప్పటికే మూడు సెట్ల ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వీటిని ఆయా పరీక్ష కేంద్రాల సమీపంలోని 51 స్టోరేజీ పాయింట్లు (పోలీస్ స్టేషన్లు)ల్లో ఖాకీల పహారాలో భద్రపర్చారు.
12 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు
జిల్లాలో మొత్తం 12 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. వీటిలో కోవూరు, తోటపల్లిగూడూరు, బిట్రగుంట, మర్రిపాడు, ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు, కుల్లూరు, చేజర్ల, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వీటిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఈ కేంద్రాలకు అదనంగా అడిషనల్ చీఫ్ సూపరిటెండెంట్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులను నియమించనున్నారు.
పక్కాగా నిర్వహణ
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఇంటర్ అధికారులు ఏర్పాట్లు చేశారు. 79 కేంద్రాల్లో ప్రతి కేంద్రానికీ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించారు. 1,200 మందికి పైగా ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. పరీక్షలు జరిగే కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. సమీపంలోని జిరాక్స్, ఆన్‌లైన్ సెంటర్లను మూయించనున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్లకు మాత్రమే ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసిన సెల్‌ఫోన్‌ను అనుమతిస్తారు. విద్యార్థులు కాలిక్యులేటర్, మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకూడదు. పరీక్ష కేంద్రాల ద్వారం వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలికి అనుమతించనున్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
విద్యార్థుల ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి 0861–2320312 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. bie.ap.gov.in వెబ్‌సైట్ లేదా 95523 00009 వాట్సాప్ నంబర్‌కు హాల్ టికెట్ నంబర్, ఆధార్ లేదా డేట్ ఆఫ్ బర్త్‌ను నమోదు చేసి పంపడం ద్వారా నే రుగా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ను కల్పించారు. హాల్ టికెట్‌పై సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు. ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా ఆర్‌ఐఓకు ఫిర్యాదు చేయాలి. పరీక్ష సమయానికి అరగంట ముందుగా కేంద్రంలోకి అనుమతించనున్నారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవా లని ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు.
రేపట్నుంచి మార్చి 20 వరకు..
జంబ్లింగ్ విధానం అమలు
79 కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
హాజరుకానున్న
53,200 మంది విద్యార్థులు
ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారుల నియామకం
1200 మందికి పైగా ఇన్విజిలేటర్లు
4 ఫ్లయింగ్..
ఐదు సిట్టింగ్ స్క్వాడ్ల ఏర్పాటు
సజావుగా జరిగేలా చర్యలు
ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాం. కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు పకడ్బందీగా నిర్వహిస్తాం. పరీక్ష సమయానికి ఐదు నిమిషాల వరకే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించనున్నాం. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా గంట ముందే కేంద్రం వద్దకు చేరుకోవాలి. సమస్యాత్మక కేంద్రాల్లో అదనంగా సిబ్బందిని నియమిస్తాం. విద్యార్థులు ఒత్తిడికి గురికా కూడదు. సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే పరిష్కరిస్తాం.
– శ్రీనివాసులు, ఆర్‌ఐఓ

ఇంటర్ పరీక్షలకు వేళాయె

ఇంటర్ పరీక్షలకు వేళాయె
Comments
Please login to add a commentAdd a comment