
సోమశిలకు రక్షణేదీ..?
ఆత్మకూరు: జిల్లాలో సాగు, తాగునీటికి వరదాయినైన సోమశిల జలాశయ సేఫ్టీ వాల్‌కు రక్షణ కరువైంది. వాస్తవానికి నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇది ప్రస్తుతం ప్రమాదభరితంగా మారింది. ఈ అంశంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
బీటలు వారి.. దుర్భరంగా
జలాశయంలో ఐదు నెలలుగా 60 టీఎంసీలకుపైగా నీరు నిల్వ ఉంది. 1979 – 80లో ఆప్రాన్‌కు.. జలాశయానికి రక్షణగా ఉండేలా ఎడమ వైపు రాళ్లతో పటిష్టంగా రక్షణ గోడను కోర్‌వాల్‌గా నిర్మించారు. 100 మీటర్ల వెడల్పు.. 40 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ రక్షణ గోడ పలుచోట్ల బీటలు వారి.. రాళ్లు సైతం ఊడి రంధ్రాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఫలితంగా ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇసుకతో అధిక బరువు
మూడేళ్ల క్రితం వచ్చిన భారీ వరదలకు ఆప్రాన్ దెబ్బతినింది. మరమ్మతులను ఐదు నెలల క్రితం ప్రారంభించి అర్ధాంతరంగా నిలిపేశారు. దెబ్బతిన్న రక్షణ గోడ పైభాగంలోని ఖాళీ స్థలంలో టన్నుల ఇసుకను ఆ సమయంలో నిల్వ ఉంచారు. బీటలు వారి దెబ్బతిన్న రక్షణ గోడపై బరువు మరింత పెరిగింది. పనులను నిలిపేయడంతో ఇవి నేటికీ అలానే ఉన్నాయి. మరోవైపు ఆప్రాన్ మరమ్మతుల సమయంలో సంబంధిత కాంట్రాక్టర్ తగు సాంకేతిక పరిజ్ఞానం లేకుండా బ్లాస్టింగ్ పనులు చేయడంతో రక్షణ గోడ దెబ్బతిని ఉండొచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం ఎలాంటి నివేదికను ఉన్నతాధికారులకు అందించలేదు.
హామీ నీటిమూటేనా..?
సోమశిల జలాశయ పరిశీలన నిమిత్తం మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు గతేడాది అక్టోబర్‌లో వచ్చారు. మరమ్మతు పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఐదు నెలలు పూర్తయినా ఆప్రాన్ పనులు సగం కూడా కాలేదు. మిగిలిన పనులు ఎప్పటికి పూర్తవుతాయో నేటికీ స్పష్టత లేదు.
నాలుగు దశాబ్దాల క్రితం
సేఫ్టీ వాల్ నిర్మాణం
నేడు ప్రమాదభరితంగా..
నిలిచిన ఆప్రాన్ పనులు
ఆరు నెలల్లో పూర్తి చేస్తామని సీఎం హామీ
నేటికీ అతీగతీ లేని వైనం
ప్రమాదమేమీలేదు
జలాశయ రక్షణ గోడను పరిశీలిస్తున్నా. ప్రమాదమేమీలేదు. గోడ పైభాగంలో ఉన్న ఇసుకను జేసీబీలతో తొలగించాలని సిబ్బందిని ఆదేశించా. ఆప్రాన్ పనులు నిలిచిన విషయం వాస్తవమే. త్వరలోనే ప్రారంభి రక్షణ గోడకు మరమ్మతులు చేయిస్తాం.
– దశరథరామిరెడ్డి, ప్రాజెక్ట్ ఈఈ

సోమశిలకు రక్షణేదీ..?

సోమశిలకు రక్షణేదీ..?
Comments
Please login to add a commentAdd a comment