కుష్టు వ్యాధి నివారణే లక్ష్యం
నెల్లూరు(అర్బన్): కుష్టు వ్యాధి నివారణే లక్ష్యంగా వైద్య సిబ్బంది కృషి చేయాలని ఏడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ పేర్కొన్నారు. కుష్టువ్యాధిపై నగరంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎల్సీడీ సర్వేలో జిల్లాలో 28 మంది కుష్టు రోగులను గుర్తించారని, వీరికి మందులను సకాలంలో అందజేశామని చెప్పారు. మందులను సక్రమంగా వినియోగిస్తే నయమవుతుందని తెలిపారు. పీహెచ్‌సీల పరిధిలోని అనుమానిత రోగులను పరీక్షించి వ్యాధిని నిర్ధారించాలని కోరారు. డీపీఎమ్మార్ శిబిరాలను పీహెచ్‌సీల పరిధిలో ప్రతి నెలా నిర్వహిస్తూ అనుమానిత కుష్టు రోగులను గుర్తించి పరీక్షలు చేయించి చికిత్సను అందించాలని చెప్పారు. అంగవైకల్యం ఉన్న కేసులను గుర్తించి వారికి శస్త్ర చికిత్సలు చేయించేందుకు డీఎఫ్‌ఐటీ కేంద్రానికి పంపాలన్నారు. డీఎన్‌ఎంఓ సురేంద్రబాబు, ఫిజియోథెరపిస్ట్ నరసింహులు, డీఎఫ్‌ఐటీ అధికారి పీటర్, సిబ్బంది మల్లమ్మ, ప్రసాదాచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment