కేన్సర్‌పై అవగాహన అవసరం
నెల్లూరు(అర్బన్): కేన్సర్ వ్యాధిపై అవగాహన పెంచుకొని, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రెడ్‌క్రాస్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ సూపరింటెండెంట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. పొదలకూరు రోడ్డులోని కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులకు గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జంక్‌ఫుడ్, పంటలకు ఎక్కువగా వాడుతున్న పురుగుమందులు, రసాయనిక ఎరువులు, ప్లాస్టిక్ వినియోగం, కొన్ని రకాల వైరస్‌లు, పొగాకు వినియోగం, కాలుష్య కారణంగా కేన్సర్ రోగాలు పెరిగాయని చెప్పారు. ప్రజలు తమ ఆహార అలవాట్లను మార్చుకోవాలని కోరారు. 30 ఏళ్లు దాటిన వారు ఏడాదికోసారి స్కానింగ్ లాంటి పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. చిన్న పరీక్షల ద్వారా కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించొచ్చన్నారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ లక్ష్మి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ వాకాటి విజయకుమార్‌రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ ముత్తు, ఆస్పత్రి జీఎం ఇస్కా భక్తవత్సలరెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్లు మోహనాంబ, మృదుల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment