
వేర్వేరు చోట్ల ఇద్దరి మృతి
నెల్లూరు(క్రైమ్): అనారోగ్యం తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. కొడవలూరు మండలం తలమంచికి చెందిన పి.శ్రీనివాసులు అలియాస్ శీనయ్య (35) అవివాహితుడు. అతను నెల్లూరు హరనాథపురం ఒకటో వీధిలో శ్రీరాజరాజేశ్వరి ప్రొవిజన్స్ షాపు నిర్వహిస్తున్నాడు. రోజూ ఇంటి వద్ద నుంచి షాపునకు వచ్చి వెళ్లేవాడు. రెండేళ్లుగా శీనయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసయ్యాడు. ఆరోగ్యం ఎంతకీ కుదుట పడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఈనెల 24వ తేదీ రాత్రి తన షాపు వద్దనే మద్యంలో పురుగు మందు కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న నారాయణ కళాశాల వాచ్‌మెన్ ఈ విషయాన్ని గమనించి శీనయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. అనంతరం శీనయ్యను అపోలో హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి అన్న ప్రసాద్ గురువారం బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎం.పుల్లారెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో..
రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్యామ్ బిహారీ (28), ప్రీతి దంపతులకు ఇద్దరు సంతానం. అతను పీఓపీ (సీలింగ్) పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో కొన్నేళ్ల క్రితం అతను ఒక్కడే ఉపాధి నిమిత్తం నెల్లూరు వైఎస్సార్‌నగర్‌లో ఉంటున్న బంధువుల వద్దకు వచ్చాడు. అయ్యప్పగుడి ప్రాంతానికి చెందిన పప్పు రాజ్ మేసీ్త్ర వద్ద పనులు చేస్తున్నాడు. అప్పుడప్పుడు భార్యాపిల్లల వద్దకు వెళ్లి వచ్చేవాడు. ఈనెల 25వ తేదీన శ్యామ్ తన సహచరుడు బబ్లూరాజ్‌తో కలిసి బైక్‌పై పనికి బయలుదేరాడు. వేదాయపాళెం రైల్వేస్టేషన్ ఆర్చ్ వద్ద రోడ్డు దాటుతుండగా అయ్యప్పగుడి వైపు వెళ్తున్న బైక్ వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో శ్యామ్‌కు తీవ్రగాయాలయ్యాయి. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పప్పు రాజ్ ఫిర్యాదు మేరకు సౌత్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment