అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Published Sun, Mar 2 2025 12:02 AM | Last Updated on Sun, Mar 2 2025 12:02 AM

అనుమా

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

పొదలకూరు: పట్టణంలోని దుకాణాల వద్ద భిక్షాటన చేసుకుంటూ మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తి (45) స్థానిక శివాలయ సమీపంలోని శ్మశాన వాటికలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారాన్ని శనివారం అందించారు. సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై హనీఫ్‌ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తలపై గాయాలుండటం, రక్తపు మడుగులో పడి ఉండటంతో హత్యగా అనుమానిస్తున్నారు. హిందీ మాట్లాడే సదరు వ్యక్తి రెండేళ్లుగా పట్టణంలో తిరిగేవారని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా ప్రాథమిక ఆధారాలను సేకరించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని యువకుడి దుర్మరణం

నెల్లూరు(క్రైమ్‌): రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన ఘటన వేదాయపాళెం రైల్వేస్టేషన్‌ సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడు సుమారు 30 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి.. మెరూన్‌, నలుపు రంగు చెక్స్‌ ఫుల్‌హ్యాండ్స్‌ చొక్కా, బ్లూ రంగుపై తెలుపు డిజైన్‌ షార్ట్‌ను ధరించి ఉన్నారు. మృతుడి కుడిచేతిపై ఆర్‌ఏకేయూ అని ఇంగ్లిష్‌ అక్షరాలతో పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని నెల్లూరు రైల్వే ఎస్సై మాలకొండయ్య పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.

బైక్‌ ఢీకొని వృద్ధుడు..

తోటపల్లిగూడూరు: బైక్‌ ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందిన ఘటన విలుకానుపల్లిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై వీరేంద్రబాబు సమాచారం మేరకు.. విలుకానుపల్లి దళిత కాలనీకి చెందిన గెద్ది శేషయ్య (64) బహిర్భూమి నిమిత్తం గ్రామ సమీపంలోని కోడూరు ప్రధాన రహదారివైపు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో వెళ్లారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో గాలింపు చర్యలను కుటుంబసభ్యులు చేపట్టారు. కోడూరు ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న పంచాయితీ దొరువులో శేషయ్య పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. నెల్లూరులోని ఓ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరులోని జీజీహెచ్‌కు తరలించారు. ఘటన స్థలంలో లభ్యమైన ఏటీఎం కార్డుల ఆధారంగా సౌత్‌ఆములూరుకు చెందిన సుమన్‌ బైక్‌ ఢీకొని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రేపట్నుంచి ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ పరీక్షలు

నెల్లూరు (టౌన్‌): ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ పరీక్షలను సోమవారం నుంచి ఈ నెల 15 వరకు జిల్లాలోని 20 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్న పరీక్షలకు 3580 మంది అభ్యాసకులు హాజరుకానున్నారు. ఐదు ఫ్లయింగ్‌.. పది సిట్టింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు 20 మంది చొప్పున, ఇన్విజిలేటర్లుగా 200 మందిని నియమించారు. సమస్యలుంటే హెల్ప్‌డెస్క్‌ 83414 08109 నంబర్‌ను సంప్రదించొచ్చు. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. కాగా పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే యాజమాన్యాలపై చర్యలు తప్పవని డీఈఓ బాలాజీరావు స్పష్టం చేశారు.

వీఎస్‌యూలో 4న జాబ్‌మేళా

వెంకటాచలం: కాకుటూరు సమీపంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో జాబ్‌మేళాను ఏపీఎస్సెస్డీసీ, జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయం, సీడాప్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్నామని వీసీ అల్లం శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరై ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారని చెప్పారు. 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండి, ఎస్సెస్సీ, ఇంటర్‌, డిప్లొమా, ఐటీఐ చదివిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి 1
1/2

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి 2
2/2

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement