పీడించండి.. వసూలు చేయండి
● హడలెత్తిస్తున్న మార్కెటింగ్ శాఖ
● సెస్ వసూలు విషయంలో
ఉన్నతాధికారుల ఒత్తిళ్లు
● 15 రోజుల్లో రూ.7 కోట్లు ముక్కుపిండి వసూలు
● కూటమి ప్రభుత్వంపై కన్నెర్ర
గోదాము (ఫైల్)
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో నెల్లూరు, కోవూరు, కావలి, కందుకూరు, రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి, సర్వేపల్లి మార్కెట్ కమిటీలున్నాయి. వాటి పరిధిలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు మార్కెట్ శాఖకు సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది విధించిన లక్ష్యం రూ.34.43 కోట్లు. ఈ నెలాఖరుకు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఏ ప్రాంతాల్లో ఎంతంటే..
నెల్లూరులో రూ.5.13 కోట్లు, కోవూరులో రూ.6 కోట్లు, కావలిలో రూ.3.83 కోట్లు, కందుకూరులో రూ.1.36 కోట్లు, రాపూరులో రూ.46 లక్షలు, ఆత్మకూరులో రూ.1.17కోట్లు, ఉదయగిరిలో రూ.1.18 కోట్లు, సర్వేపల్లిలో రూ.1.49 కోట్ల చొప్పున ఇప్పటి వరకు వసూలు చేసినట్లు తెలిసింది. నెలాఖరు సమీపిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఒత్తిడితో గత 15 రోజుల్లో సుమారు రూ.7 కోట్ల వరకూ ముక్కుపిండి వసూలు చేసినట్లు సమాచారం.
ఎన్నడూ లేని విధంగా..
సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వారి నుంచి సెస్ వసూలు చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేసే విధానానికి తెర తీసింది. ఎన్నడూ లేని విధంగా విద్యార్థులుండే హాస్టల్స్, బేకరీలు, స్వీట్ షాపుల్లో మార్కెట్ శాఖ తనిఖీలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్స్‌లో వాడే బియ్యం ఎక్కడి నుంచి తెచ్చారు?, బిల్లు ఉందా?, ఏ మిల్లు నుంచి తెచ్చారు? లేక ఏ రైతు నుంచి కొనుగోలు చేశారనే వివరాలను తెలుసుకుంటున్నారు. నిర్వాహకులు నేరుగా రైతుల నుంచి తీసుకుని కొనుగోలు చేస్తే దానికి సెస్ కట్టారా?, ఆ రైతు వివరాలు ఇవ్వండంటూ బెంబేలెత్తిస్తున్నారు. దీంతోపాటు స్వీట్ షాపులు, బేకరీల్లో తనిఖీలు చేస్తూ మీరు వాడుతున్న స్వీట్స్‌కు జీడిపప్పు, బాదం పప్పు, ఇతర పప్పు దినుసులు ఎక్కడి నుంచి కొన్నారు? తదితరాలను అడుగుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
ఒత్తిడి చేయడంతో..
పనులన్నీ పక్కనపెట్టి సెస్ వసూళ్లపైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బందికి నిద్రాహారాలు కరువయ్యాయి. రాత్రి, పగలు తేడా లేకుండా చెక్‌పోస్టు పాయింట్లలో ఉండి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. టార్గెట్ పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు తెగేసి చెప్పడంతో అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.
వ్యాపారులు నష్టాల్లో ఉన్నా.. వ్యవసాయంలో లాభాలు రాకపోయినా.. మనకు సంబంధం లేదు. ఆహార ఉత్పత్తులు రవాణా చేసే వారి నుంచి సెస్‌ను ముక్కుపిండి వసూలు చేయాలని జిల్లాలోని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెస్ వసూళ్లంటూ అధికారులు తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం వసూలు
మార్కెట్ శాఖకు కట్టాల్సిన సెస్ వసూళ్లలో మేం నిబంధనలు పాటిస్తున్నాం. సెస్ కట్టాల్సిన వారి నుంచి తప్పకుండా వసూలు చేసేలా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రూ.20 కోట్ల మేర వసూలైంది. ఈనెల చివరికి టార్గెట్ పూర్తి చేసే పనిలో ఉన్నాం.
– అనితాకుమారి, ఏడీ,
జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ
Comments
Please login to add a commentAdd a comment