
ఘనంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే
● 177 మందికి డాక్టర్ పట్టాలు
నెల్లూరు(అర్బన్): నెల్లూరు దర్గామిట్టలోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సోమవారం రాత్రి గ్రాడ్యుయేషన్ (స్నాతకోత్సవం) డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల పీజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు తెచ్చుకోవడం ఒక వరమన్నారు. ఎంతో కష్టపడి డాక్టర్లుగా మారారని కొనియాడారు. రోగులను గౌరవిస్తూ వారిని ప్రేమగా చూడాలన్నారు. డిప్యూటి కలెక్టర్ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ రోగుల ప్రాణాలను కాపాడే డాక్టర్లకు సమాజంలో ప్రత్యేక స్థానముందన్నారు. దానిని నిలుపుకొనేందుకు కృషి చేయాలన్నారు. ప్రొఫెసర్లు మస్తాన్‌బాషా, కాలేషాబాషాలు మాట్లాడుతూ నిరంతర శ్రమ వల్లనే నేడు డాక్టర్లుగా మారారని కొనియాడారు. నీతి, నియమాలు, రోగులను ప్రేమతో మాట్లాడే విధానాలే డాక్టర్లను ఉన్నత స్థానంలో నిలుపుతాయన్నారు. నూటికి 80 శాతం పేదరోగులే ఆస్పత్రులకు వస్తారన్నారు. అలాంటి వారిని అక్కున చేర్చుకుని సేవలందించాలని కోరారు. డబ్బు కోసం వైద్య ప్రాథమిక లక్ష్యాలను అమ్ముకోవద్దని సూచించారు. ప్రస్తుతం డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయన్నారు. అలా జరగకుండా ఉండాలంటే నైతిక విలువలు పాటిస్తూ.. వాస్తవాలను చెబుతూ వైద్యసేవలందించాలని సూచించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆరో బ్యాచ్‌గా నూటికి నూరుశాతం మంది డాక్టర్లుగా పట్టాలు అందుకోవడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా పట్టాలు పొందిన వారందరితో విలువలతో వైద్య సేవలందిస్తామంటూ ప్రమాణం చేయించారు. 177 మందికి పట్టాలు అందజేశారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డాక్టర్లు వెంకటేశ్వర్లు, ఖాదర్‌వలీ, రాజమ్మ, విజిత, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.

ఘనంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే
Comments
Please login to add a commentAdd a comment