
డీసీపల్లిలో అగ్నిప్రమాదం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఓ బ్యారెన్ సమీపంలో తాత్కాలికంగా వలస కూలీలు ఏర్పాటు చేసుకున్న పది గుడిసెలు దగ్ధమయ్యాయి. స్థానికులు, అధికారుల కథనం మేరకు.. డీసీపల్లిలో ఓ పొగాకు బ్యారెన్‌లో పని చేసుకునే కూలీలు సమీపంలోనే తాత్కాలికంగా గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. గురువారం ఉదయం పనికి వెళ్లగా 9.45 గంటల సమయంలో ఒక్కసారిగా గుడిసెల్లో మంటలు వ్యాపించాయి. పదిగుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. అంతేకాక ఒక ఆటో, ఒక మోటార్‌బైక్, నాలుగు మొబైల్ ఫోన్లు, సామగ్రి దగ్ధమవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మర్రిపాడు ఇన్‌చార్జి తహసీల్దార్ అనిల్‌కుమార్, ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సై శ్రీనివాసరావు, అగ్నిమాపక కేంద్రం అధికారి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని కేసు నమోదు చేసుకున్నారు. రూ.4 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు చెబుతున్నారు.
● సర్వం కోల్పోయిన కుటుంబాలకు ఇన్‌చార్జి తహసీల్దార్ అనిల్‌కుమార్ అండగా నిలిచారు. సొంత నిధులతో దుస్తులను అందజేశారు. పది కిలోల వంతున బియ్యం పంపిణీ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక అందజేసి బాధితులకు నష్ట పరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు.
పది గుడిసెలు, ఆటో, బైక్ దగ్ధం
రూ.4 లక్షలకు పైగా ఆస్తి నష్టం

డీసీపల్లిలో అగ్నిప్రమాదం