
కమనీయం.. శ్రీవారి కల్యాణ వైభోగం
బిట్రగుంట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండబిట్రగుంట బిలకూటక్షేత్రం బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన ప్రసన్నుడి కల్యాణం శుక్రవారం కమనీయంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణలు, వేదపండితుల దివ్యమంత్రోచ్ఛరణలు, శుభకర మేళతాళాల మధ్య స్వామివారి కల్యాణం వైకుంఠ వైభవాన్ని తలపించింది. పాతబిట్రగుంట, కొండబిట్రగుంట వీధుల్లో గజవాహనంపై పెండ్లి కుమారుడిగా విహరించిన స్వామి వారు ఉదయం శుభముహూర్తంలో కల్యాణవేదిక వద్దకు చేరుకున్నారు. పలు రాష్ట్రాల నుంచి తెప్పించిన పుష్పాలు, తులసీ మాలలతో శోభాయమానంగా అలంకరించిన కల్యాణ వేదికపై ఉభయ దేవేరులతో స్వామివారు అలంకార భూషితులయ్యే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంభ్రాలు తీసుకురాగా, కల్యా
ణోత్సవం ఉభయకర్తలు పట్టువస్త్రాలు, కల్యాణ ద్రవ్యాలు తీసుకువచ్చారు. వేదికపై స్వామివారు సర్వాలంకారణ భూషితులైన తర్వాత అర్చక బృందం వైఖానస ఆగమోక్తంగా కల్యాణ వేడుకను ప్రారంభించారు. తొలుత విశ్వక్సేనుని పూజతో ప్రారంభించి యజ్ఞోపవీత ధారణ, కంకణ ధారణ, వేదమంత్రోక్తంగా కల్యాణ ద్రవ్యాలను శుద్ధిచేసే పుణ్యహవచనం, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. మధుపర్కం, దృశ్య, స్పర్శ, శ్రవణ వంటి షోడశోపచార పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి కల్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు భక్తిపారవశ్యంతో గోవిందనామ స్మరణలు చేస్తుండగా, భాజాభజంత్రీలు ఉచ్ఛ స్థాయిలో మోగుతుండగా మాంగళ్యధారణ నేత్రపర్వంగా సాగింది. ఇదే సమయానికి మరో 10 జంటలకు పైగా స్వామివారి సన్నిధిలో ఒక్కటయ్యాయి.
రథోత్సవంలో సమస్యలు
వైకుంఠాన్ని తలపించిన
బిలకూటక్షేత్రం
గోవింద నామస్మరణలతో
మారుమోగిన కొండబిట్రగుంట
ప్రసన్నుడి కళ్యా ణోత్సవం అనంతరం స్వామివారి రథోత్సవంలో సమస్యలు ఎదురయ్యాయి. ఆలయ అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణా లోపం కారణంగా రథం చక్రాలు పట్టేసి ముందుకు కదిలేందుకు మొరాయించడంతో ఆగమేఘాల మీద మరమ్మతులు చేపట్టారు. కల్యాణం తర్వాత శ్రీదేవి, భూదేవితో కలిసి కొండ దిగువన ఉన్న రథంపై స్వామివారు కొలువుదీరారు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య రథం కదిలిన కొద్ది నిమిషాల్లోనే చక్రాలు పట్టేశాయి. రథం ముందుకు కదలకపోవడంతో హుటాహుటిన మరమ్మతులు చేయిస్తున్నారు. రాత్రి ఏడు గంటల వరకు కూడా మరమ్మతులు పూర్తి కాలేదు. దీంతో ట్రాక్టర్‌పై స్వామివారి ఊరేగింపు నిర్వహించాలని దేవదాయశాఖ అధికారులు, పాలకవర్గం చర్చలు జరుపుతోంది. బ్రహ్మోత్సవాల నిర్వహణలో దేవదాయశాఖ అధికారులు మొదటి నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్సవాలకు సరైన ప్రచారం కల్పించకపోవడం, వీఐపీ పాస్‌లు, వెహికల్ పాస్‌ల్లో మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈఓ కూడా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం వినిపించాయి. ఉభయకర్తలు, దాతలతోనూ ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కనీసం రథోత్సవం ముందుగా ఏర్పాట్లు సరిచూసుకుని ఉంటే స్వామివారి రథోత్సవం మధ్యలో నిలిచిపోయేది కాదని భక్తులు మండి పడుతున్నారు.

కమనీయం.. శ్రీవారి కల్యాణ వైభోగం
Comments
Please login to add a commentAdd a comment