
మాయమాటలు చెప్పడంలో సిద్ధహస్తులు
● చంద్రబాబుపై మండిపడిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు): మాయమాటలు చెప్పడంలో సీఎం చంద్రబాబు సిద్ధహస్తులని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. డైకస్‌రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసింది తానేనని ఆయన ప్రకటించడమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని పచ్చ పత్రికలో ప్రచురించడం మరో విడ్డూరమని విమర్శించారు. వాస్తవానికి పొట్టి శ్రీరాములు జిల్లాగా 2008 జూన్‌లో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ప్రకటించిన అంశం అందరికీ తెలుసునన్నారు. దీనికి సంబంధించి అదే ఏడాది మే 25న జీఓ విడుదలైన అంశాన్ని ప్రస్తావించారు. ప్రజలు నవ్వుకుంటారనే కనీస ఆలోచన లేకుండా చంద్రబాబు ఇలా అబద్ధాలు చెప్పడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెండ్ల విషయంలోనూ ఆయన గతంలో ఇదే తరహాలో విచిత్ర వ్యాఖ్యలు చేసిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రతి గొప్ప పనినీ తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు మొదట్నుంచి అలవాటని విమర్శించారు.
అమరజీవి 56 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని చంద్రబాబు ప్రకటించారని, గతంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించి, దాన్ని విస్మరించారని ఆరోపించారు. ఆయన మాటలు వింటే పొట్టి శ్రీరాములు ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు.
రైతుల బాధలు వర్ణనాతీతం
పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలేదని, దీంతో అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా మారిందని కాకాణి చెప్పారు. అధికారుల లెక్కలు తప్పడం.. వాస్తవాలు ప్రభుత్వ దృష్టికి రాకపోవడంతో రైతులకు మేలు జరగడంలేదని టీడీపీ అనుకూల పత్రికల్లో ప్రచురించారన్నారు. తాను చేస్తున్న తప్పులను వదిలేసి అధికారులపై నింద వేసి తప్పించుకునే ధోరణిని ఆయన అవలంబిస్తున్నారనే అంశాన్ని అందులో పేర్కొన్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే సదరు మీడియా సంస్థ స్వరం మారిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పుట్టి ధాన్యానికి రూ.19,720 గిట్టుబాటు ధర కల్పిస్తే, అది ప్రస్తుతం రూ.15,500కు పడిపోయిందని వివరించారు.