
ఉమ్మడి జిల్లాలో గూడూరు, నెల్లూరులో ఖాళీ ఎయిడెడ్ పోస్టు
● 10 టీచర్ పోస్టుల
భర్తీకి సన్నాహాలు
● ఇప్పటికే పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలవసూలు
● ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశాలు
● ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని కోర్టుకు వెళ్లిన అసోసియేషన్ నేతలు
● ఈ వారంలో ఎయిడెడ్ పోస్టులకు
పరీక్ష జరిగే అవకాశం
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు ఆయా యాజమాన్యాలు భారీ మొత్తంలో బేరం పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ పోస్టుల కోసం కొంతమంది వద్ద నుంచి డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. అయితే నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ వారంలో పరీక్ష నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణపై రాష్ట్ర ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించి ఆయా అభ్యర్ధుల నుంచి పోస్టును బట్టి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తే తమ అభ్యర్థులకు పోస్టులు దక్కే అవకాశం ఉండదేమన్న అనుమానంతో ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలని కొన్ని యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి.
జిల్లాలో 25 ఎయిడెడ్ పాఠశాలలు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 23, కందుకూరు డివిజన్‌లో 3 ఎయిడెడ్ పాఠశాలలు జిల్లా విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి. కావలిలోని ఎలిమెంటరీ స్కూల్, డీఆర్‌ఎల్‌కేఆర్ వీబీ హైస్కూల్, సమి శేషాచలంశెట్టి విశ్వోదయ గర్‌ల్స్ హైస్కూల్, అల్లూరులోని ఎఫ్‌బీసీ యూపీ స్కూల్, రామకృష్ణ జూనియర్ కళాశాల, తలమంచిలోని వీపీసీ యూపీఎస్, నార్తు రాజుపాళెంలోని ఆర్‌సీసీ ఎలిమెంటరీ స్కూల్, బుచ్చిరెడ్డిపాళెంలోని శ్రీహరనాథ ఎలిమెంటరీ స్కూల్, ఉయ్యాలపల్లిలోని ఎస్‌ఎంఎస్ ఎలిమెంటరీ స్కూల్, నెల్లూరులోని వేద సంస్కృత హైస్కూల్, వేద సంస్కృత ఎలిమెంటరీ స్కూల్, ఏబీఎం ప్రైమరీ స్కూల్, ఎస్‌కేడీసీ ఈఎల్‌ఈ స్కూల్, వెంకటేశ్వరపురంలోని జీఎంఎం ఈఎల్‌ఈ, సెయింట్ జోసెఫ్స్ బాలికల ఈఎల్‌ఈ స్కూల్, శ్రీకస్తూరిదేవి బాలికల హైస్కూల్, సెయింట్ జోసెఫ్స్ బాలికల హైస్కూల్, లేగుంటపాడులోని ఎయిడెడ్ ఈఎల్‌ఈ స్కూల్, గూడూరులోని రాణిపేట్ ఈఎల్‌ఈ స్కూల్, జీఎం యూపీ స్కూల్, శ్రీ పొట్టి శ్రీరాములు యూపీ స్కూల్, వెంకటగిరిలోని ఆర్‌వీఎం హైస్కూల్, సూళ్లూరుపేటలోని ఎన్‌ఎంసీ ఈఎల్‌ఈ స్కూల్, కందుకూరు డివిజన్ కరేడులోని జీఎస్‌ఎస్‌టీ ప్రైమరీ, హైస్కూల్స్ ఉన్నాయి.
10 ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్
ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచరు పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయా ఎయిడెడ్ పాఠశాలల్లో 20 మంది ఉపాధ్యాయులు మిగులు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. మిగులు ఉపాధ్యాయులను కొరత ఉన్న ఎయిడెడ్ పాఠశాలల్లో సర్దుబాటు చేసేందుకు ఆయా ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో నెల్లూరులోని కస్తూరిదేవి బాలికల హైస్కూల్, గూడూరులోని శ్రీ పొట్టిశ్రీరాములు ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కస్తూరిదేవి బాలికల హైస్కూల్‌లో 7 పోస్టులు, శ్రీ పొట్టిశ్రీరాములు స్కూల్‌లో 3 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. కస్కూరిదేవి స్కూల్‌లో పోస్టులకు ఆన్‌లైన్‌లో 509, ఆఫ్‌లైన్‌లో 287, ఏడాది క్రితం వచ్చిన దరఖాస్తులు 396 కలిపి మొత్తం 1192 దరఖాస్తులు వచ్చాయి. శ్రీ పొట్టిశ్రీరాములు స్కూల్‌లో 3 పోస్టులకు ఆన్‌లైన్‌లో 337, ఆఫ్‌లైన్‌లో 79 కలిపి మొత్తం 416 దరఖాస్తులు వచ్చాయి.
పరీక్ష ఎపుడంటే..
కస్తూరిదేవి, శ్రీ పొట్టిశ్రీరాములు స్కూల్స్‌లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే కస్తూరిదేవి స్కూల్ యాజమాన్యానికి ఆఫ్‌లైన్ లో వచ్చిన 287 దరఖాస్తులను రిక్రూట్‌మెంట్ అధికా రి నెల్లూరు డిప్యూటీ డీఈఓకు పంపించాల్సి ఉంది. ఎన్నిసార్లు కబుర్లు పంపినా ఆ దరఖాస్తులు ఇ చ్చేందుకు యాజమాన్యం అంగీకరించలేదని తెలిసింది.
యాజమాన్యం
అభ్యర్థులు
ఈ వారంలో పరీక్ష ఉండే అవకాశం
ఎయిడెడ్ స్కూల్స్‌ల్లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ వారంలో పరీక్ష ఉండే అవకాశం ఉంది. పరీక్షకు సంబంధించి అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను అప్‌లోడ్ చేసే పనిలో ఉన్నాం. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పరీక్ష నిర్వహిస్తాం.
– ఆర్.బాలాజీరావు, డీఈఓ