
నా మద్యం షాపును హ్యాండోవర్ చేసుకోండి
నెల్లూరు(అర్బన్): ఆమె టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారు. లాటరీలో ఆమెకు మద్యం దుకాణం వచ్చింది. ఎకై ్సజ్ సీఐ లైసెన్సు ఇవ్వకుండా సొంత పార్టీ వారే అడ్డుకున్నారు. తీవ్ర ఇబ్బందులుకు గురి చేస్తున్నారు. ఆమె తీవ్రంగా నష్టపోయింది. అప్పులు తీర్చే క్రమంలో తాళిబొట్టు అమ్ముకుంది. చివరికి మద్యం షాపు తనకు వద్దు ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకుని విముక్తి చేయాలని ప్రాధేయపడుతోంది. ఆమె పేరు కడియపు లక్ష్మి. పొదలకూరు మండలంలోని తాటిపర్తి వాసి. సోమవారం కలెక్టరేట్‌లో జెడ్పీ సీఈఓకి వినతిపత్రం ఇచ్చింది. వివరాలల్లోకి వెళితే.. లక్ష్మి ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజయానికి పనిచేశారు. గత సంవత్సరం మద్యం షాపులకు తీసిన లాటరీలోకి ఆమెకు 154 నంబర్ షాపు దక్కింది. పొదలకూరులో దుకాణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తుమ్మల శ్రీనివాసులు అనే వ్యక్తి షాపును అద్దెకు తీసుకుని అడ్వాన్స్ కింద రూ.లక్ష చెల్లించింది. అగ్రిమెంట్ రాసుకున్నాను. అయితే ఎకై ్సజ్ సీఐ, సూపరింటెండెంట్‌లు లైసెన్సు ఇవ్వలేదు. పైగా అద్దెకు షాపు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన శ్రీనివాసులును ఆర్‌అండ్‌బీ అధికారుల ద్వారా రోడ్డులోకి జరిగి షాపు కట్టావంటూ అధికారపార్టీ నాయకులు బెదిరించారు. ముగ్గురి వద్ద షాపులు అద్దెకు తీసుకుని అడ్వాన్స్‌లు చెల్లించింది. వారిని అలాగే బెదిరించారు. అడ్వాన్స్ రూపంలో చెల్లించిన రూ.3 లక్షలు నగదు కూడా ఇంకా ఆమెకు రాలేదు. లైసెన్సు కోసం ఎకై ్సజ్ కార్యాలయం చుట్టూ తిరిగా.. ఆడ మనిషి అని కూడా చూడకుండా సీఐ ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలో నిలబెట్టారు. చివరికి ఆమెకు వ్యాపారం జరగని సూరాయపాళెం గ్రామంలో ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చారు. అక్కడ వద్దని ఎంత చెప్పినా భయపెట్టారు. లక్ష్మి రెండు నెలలకు మద్యం దుకాణానికి ప్రభుత్వానికి ఫీజు కింద రూ.10,83,330 చెల్లించాల్సి ఉంది. ఆమెకు రెండు నెలలకు రూ.3 లక్షలు మాత్రమే వస్తోంది. ప్రభుత్వానికి నగదు ఎలా చెల్లించాలని అడుగుతోంది. ఎకై ్సజ్ సీఐకు చెబితే నేనేమి చేయలేను. అధికారపార్టీ ఒత్తిళ్లు ఉన్నాయని చెబుతున్నాడని ఆమె వాపోతోంది. అప్పులు తీర్చేదానికి తాళిబొట్టు కూడా అమ్మేశాను. ఇప్పటికే రూ.14 లక్షలు నష్టపోయాను. మా పార్టీ వారి వల్లనే ఇలా జరిగింది. అందువల్ల ప్రభుత్వం నా దుకాణాన్ని హ్యాండోవర్ చేసుకోవాలి. లేదంటే పొదలకూరులో లైసెన్స్ ఇవ్వాలి. అలా చేయకపోతే నాకు పురుగు మందే దిక్కు అని వాపోయింది.
లైసెన్స్ ఇవ్వకుండా సొంత పార్టీ వారే అడ్డుకున్నారు
రూ.14 లక్షలు నష్టపోయా
సీఈఓకి టీడీపీ కార్యకర్త కడియపు లక్ష్మి విన్నపం