
ఎంపీ వేమిరెడ్డి
మంత్రి ఆనం
ఆనంకు చెక్ పెట్టేందుకేనా?
ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోస్టుతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చెక్ పెట్టేందుకే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీద రవిచంద్ర వ్యూహ రచన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీదకు మరో మంత్రి నారాయణ అండ ఉండనే ఉంది. డీసీసీబీ చైర్మన్ పదవిని భర్తీ చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మంత్రి ఆనం తన ముఖ్య అనుచరుడు, ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్ మెట్టుకూరుకు కట్టబెట్టాలని పావులు కదుపుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ బీద తన సొంత నియోజకవర్గానికి చెందిన తన ముఖ్య అనుచరుడు, వ్యాపార పార్టనర్ అయిన మాలేపాటి సుబ్బానాయుడుకి ఆ పోస్టు దక్కేలా పావులు కదుపుతున్నారు. గతంలో కావలిలో పార్టీకి వెనుదన్నుగా నిలిచిన మాలేపాటికే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని అంతా ప్రచారం జరిగింది. చివరి క్షణంలో దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆ సీటు దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యాడు. తనకు దక్కాల్సిన అవకాశాన్ని తన్నుకుపోయాడని మాలేపాటికి, ఎమ్మెల్యే మధ్య ప్రత్యక్ష వార్ నడుస్తోంది. మాలేపాటిని కావలి ఎమ్మెల్యే రాజకీయంగా తొక్కడంతోపాటు కేసులతో వేధింపులకు గురి చేసిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో బీదకు ఎమ్మెల్సీ పదవి దక్కడంతో కావలిపై బీదకు పట్టు పెరిగింది. తన వ్యతిరేక వర్గాన్ని బీద కూడగడుతున్నారని ఎమ్మెల్యే కావ్య లోలోన రగిలిపోతున్నాడు. ఈ నేపథ్యంలో బీద తన ముఖ్య అనుచరుడు, పార్టీ విధేయుడు అయిన మాలేపాటికి డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టాలని వ్యూహాత్మకంగా ఎంపీ వేమిరెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.