● సీఎంను కోరిన కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కలెక్టర్ ఆనంద్ సీఎం చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లాకు సంబంధించిన అంశాలను సీఎంకు వివరించారు. చాలా ఏళ్లుగా చక్కెర కర్మాగారం మూతబడి ఉందన్నారు. నెల్లూరుకు సమీపంలో పెన్నానది ఒడ్డునున్న ఈ ఫ్యాక్టరీకి చెందిన 124 ఎకరాలను పరిశ్రమల స్థాపనకు ఏపీఐఐసీకి అప్పగించేందుకు అనుమతి మంజూరు చేయాలని విన్నవించారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ రైతులు, కార్మికులకు సంబంధించిన రూ.28 కోట్ల బకాయిల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ముఖ్యమంత్రి బకాయిలు చెల్లించి, పరిశ్రమల స్థాపనకు భూమిని ఏపీఐఐసీకి అప్పగించాలని జిల్లా ప్రత్యేకాధికారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ను ఆదేశించారు. సోమశిల ప్రాజెక్ట్ అభివృద్ధి పనుల్ని మొదలుపెట్టినట్లు కలెక్టర్ తెలిపారు. రామాయపట్నం పోర్టు వద్ద పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ ఆగస్ట్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇఫ్కో కిసాన్ సెజ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు 500 ఎకరాల భూమి సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు జాలర్ల అక్రమ ప్రవేశాలు, దాడుల సమస్యను కలెక్టర్ సీఎంకు వివరించారు.