● అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
● రూ.30 వేల నష్టం
మనుబోలు: రైల్వేస్టేషన్ యార్డులో ఆగి ఉన్న బొగ్గు గూడ్స్ వ్యాగన్ నుంచి ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో స్టేషన్ మాస్టర్ అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటన బుధవారం మనుబోలు మండలంలోని కొమ్మలపూడి రైల్వేస్టేషన్‌లో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది కథనం మేరకు.. కృష్ణపట్నం పోర్టు నుంచి చైన్నెకు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు కొమ్మలపూడి స్టేషన్ వద్ద సిగ్నల్ లేకపోవడంతో ఆగింది. ఈ సమయంలో ఎండ తీవ్రత, బొగ్గు మధ్య ఒత్తిడి కారణంగా ఓ వ్యాగన్ నుంచి పొగలు రావడం గమనించిన స్టేషన్ మాస్టర్ రాజేంద్రభగత్ వెంటనే గూడూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన కొమ్మలపూడి రైల్వేస్టేషన్ వద్దకు చేరుకుని వ్యాగన్‌లో మంటలను ఆర్పి అదుపు చేశారు. బొగ్గు వ్యాగన్‌లో పాక్షికంగా కాలిపోవడంతో సుమారు రూ.30 వేల నష్టం వాటిల్లినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ విజయ్‌కుమార్, ఫైర్‌మాన్‌లు సంపత్‌కుమార్, ప్రదీప్, శ్రీహరి తదతరులున్నారు.