నెల్లూరు సిటీ: ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఈవీఎంల గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. గోడౌన్లలోని ఈవీఎంలు, వీవీ ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనూష, తహసీల్దార్ షఫీమాలిక్, డీటీ అశోక్‌వర్ధన్ పలు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పదో తరగతి సోషల్ పరీక్ష
1కి వాయిదా
నెల్లూరు(అర్బన్): ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈ నెల 31న జరగాల్సిన సోషల్ స్టడీస్ పరీక్షను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని కోరారు.
పది పరీక్షలకు
28,670 మంది హాజరు
నెల్లూరు (అర్బన్): జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి శుక్రవారం సైన్సు పరీక్ష జరిగింది. 28, 970 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 28,670 మంది హాజరయ్యారు. 300 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 130 మంది హాజరుకావాల్సి ఉండగా 110 మంది హాజరయ్యారు. 20 మంది గైర్హాజరయ్యారు.
ఓపెన్ పరీక్షలకు 208 మంది గైర్హాజరు
పదో తరగతి ఓపెన్ పరీక్షలకు సంబంధించి శుక్రవారం సోషల్ స్టడీస్ పరీక్ష జరిగింది. 1,506 మంది హాజరు కావాల్సి ఉండగా 1,298 మంది హాజరయ్యారు. మిగతా 208 మంది గైర్హాజరయ్యారు.
వైద్యశాఖలో ఎల్‌టీ
పోస్టుల భర్తీకి చర్యలు
నెల్లూరు (అర్బన్): జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయ పరిధిలో ఖాళీగా ఉన్న ఏడు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నామని డీఎంహెచ్‌ఓ సుజాత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఏప్రిల్ 4వ తేదీలోపు తమ దరఖాస్తులను డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం ఎస్పీఎస్‌నెల్లూరు.ఏపీ.జీఓవీ.ఇన్/నోటీసు/రిక్రూట్‌మెంట్ అనే వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలని సూచించారు.
మాలకొండ హుండీల
రాబడి రూ.82 లక్షలు
వలేటివారిపాళెం: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి హుండీ లెక్కింపు శుక్రవారం నిర్వహించారు. 14 శనివారాలకు వచ్చిన హుండీ ఆదాయం లెక్కించగా రూ.82.44 లక్షలు వచ్చినట్లు ఈఓ కే సాగర్‌బాబు తెలిపారు. 178 గ్రాముల బంగారం, కేజీ ఐదు గ్రాముల వెండి, ఫారిన్ కరెన్సీ యూఎస్ డాలర్స్ 56, యూఏఈ దిర్హమ్ 200, ఉమన్ బైసా 700, ఓమన్ రియాల్ 8, ఇంగ్లాడ్ పౌండ్స్ 20, నేపాల్ కరెన్సీ రూ.50 వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపునకు పర్యవేక్షణాధికారిగా వీవీఎల్ రవీంద్రనాథ్ వ్యవహరించారు.
ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత