
వంటింట్లో మోదీ మంట
సామాన్యుడి వంటింట్లో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ మంట పెట్టింది. కొన్ని రోజులుగా వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ వస్తున్న ప్రభుత్వం తాజాగా గృహ వినియోగదారులకు వాత పెట్టింది. పేద, సామాన్య కుటుంబాలకు గ్యాస్ ధర గుదిబండగా మారింది. ఇప్పటికే నిత్యావసర
వస్తువుల ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యుడిపై మరో భారం పడింది.
సీతారామపురం: కేంద్రం పేద, సామాన్య కుటుంబాల్లో గ్యాస్ మంటలు రేపింది. గృహ వినియోగ సిలిండర్ ధర రూ.840 ఉండగా తాజాగా కేంద్రం మరో రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించింది. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై ఈ పెంపు మరింత భారం కానుంది. ఈ క్రమంలో ఉజ్వల పథకం లబ్ధిదారులను సైతం ప్రభుత్వం వదల్లేదు. వారికి కూడా ఈ పెంపు వర్తింప చేసింది. ఇకపై ప్రతి 15 రోజులకు లేదా నెలకోసారి ధరలపై సమీక్షిస్తామని ప్రకటించడంతో భవిష్యత్‌లో గ్యాస్ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు ఇవ్వకనే ఇచ్చినట్లు అయింది.
నెలకు రూ.3.92 కోట్లకు పైగా భారం
జిల్లా వ్యాప్తంగా వినియోగదారులపై నెలకు రూ.3.92 కోట్ల మేర అదనపు బాదుడు పడనుంది. జిల్లాలోని పలు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో మొత్తం 7,87,484 గ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో 2,616 మాత్రమే వాణిజ్య పరమైనవి. మిగిలిన 7,84,867 కనెక్షన్లకు ధరల పెంపు వర్తించనుంది. ఈ లెక్కన జిల్లాలోని వినియోగదారులపై రూ.3,92,43,350 అదనంగా భారం పడింది. ప్రస్తుతం జిల్లాలో గ్యాస్ సిలిండ ధర రూ.840 ఉండగా ఇకపై రూ.890 కానుంది. నిబంధనలకు విరుద్ధంగా రవాణా చార్జీల పేరుతో వసూలు చేస్తున్న మొత్తం అదనం కానుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజెన్సీల పరిధిలో ఐదు కి.మీ.లోపు అదే ధరకు వినియోగదారులకు ఇవ్వాల్సి ఉండగా అది ఎక్కడా అమలు కావడం లేదు.
ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంపు
జిల్లా ప్రజలపై నెలకు
రూ.3.92 కోట్ల మేర అదనపు భారం
ధరల పెంపుతో తప్పని తిప్పలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను పెంచుతుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఒక వైపు కూరగాయల ధరలు భగ్గుమంటూ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో, మరొక వైపు వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడం చాలా బాధాకరం. ప్రభుత్వాలు స్పందించి ధరలను అదుపు చేసి, పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. – కోడె రమాదేవి, గృహిణి,
పడమటి రొంపిదొడ్ల
సామాన్యులపై తీవ్ర ప్రభావం
వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు సామాన్య ప్రజలకు, మహిళలకు భారమవడమే గాక పేద, మధ్య తరగతి ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కొనలేని స్థితిలో ఉన్న గ్యాస్ సిలిండర్ ధర మరింత పెరగడం గృహిణులను ఆవేదనకు గురి చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్ సిలిండర్ ధరలతోపాటు, నిత్యావసర సరుకుల ధరలను సైతం నియంత్రించాలి.
– పిడుగు నీలవేణి గృహిణి, సీతారామపురం

వంటింట్లో మోదీ మంట

వంటింట్లో మోదీ మంట