
ఉన్నతాధికారి టు కాంట్రాక్టర్
● ఇరిగేషన్‌లో అవినీతి పర్వం
● బినామీ పేర్లతో నిధుల స్వాహా
● గండిపాళెం జలాశయ
మరమ్మతుల్లోనూ ఇదే తీరు
● సదరు ఆఫీసర్ అవినీతిపై
విజిలెన్స్‌కు ఫిర్యాదు
ఉదయగిరి: మండలంలోని గండిపాళెం జలాశయ మరమ్మతు పనుల్లో భారీగా అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయి. 2022లో జరిగిన ఈ వ్యవహారంలో డొల్లతనం ఆర్టీ యాక్టు ద్వారా బట్టబయలైంది. పెయింటింగ్, కొత్త లైట్లను అమర్చడం, రేడియల్ గేట్స్, మోటార్ రిపేర్లకు గాను సదరు అధికారి తన బినామీ కాంట్రాక్టర్‌గా నెల్లూరుకు చెందిన అనుచరుడు హేమంత్ వర్మను నియమించుకున్నారు. ఇంకేముంది తూతూమంత్రంగా పనులు చేసి రూ.12 లక్షలను కాజేశారనే ఆరోపణలున్నాయి.
స్వాహాకు కేరాఫ్
జలాశయ ప్రధాన కాలువ మరమ్మతుల కోసం రూ.4.5 లక్షలను కేటాయించగా, పనులు చేయకుండానే నిధులను కాజేశారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పాత ఇనుప సామగ్రిని 2022లో రహస్యంగా వేలం వేయించి, తమ బినామీ హేమంత్ ద్వారా స్వాహా చేశారు. వేలాన్ని ఎప్పుడు.. ఎక్కడ నిర్వహించారు.. ఎంతమంది పాలుపంచుకున్నారు.. ఎంత వచ్చిందనే అంశం పెరుమాళ్లకే ఎరుక. అదే ఏడాది జలాశయంలో ఉన్న రూ.లక్షల విలువజేసే కర్రతుమ్మ చెట్లను వేలం వేయకుండానే విక్రయించారని తెలుస్తోంది.
ఎవర్నీ వదలరు..
ఆత్మకూరు డివిజన్లో జరిగిన పలు పనులకు సంబంధించి ముందే తన అనుకూల ట్రేడర్లకు జీఎస్టీ బిల్లులు జమ చేసి సుమారు రూ.కోటి మేర స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ఉదయగిరిలో ప్రస్తుతం జరుగుతున్న పలు ఇరిగేషన్ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించకుండానే బిల్లులు చేస్తూ కాంట్రాక్టర్ల వద్ద అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. గండిపాళెం జలాశయంలో చేపలు పెంచి, పట్టుకునే మత్స్య సొసైటీ సభ్యుల నుంచి కిలో చేపలకు రూ.పది వంతున వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
విసిగివేసారి విజిలెన్స్‌కు..
అత్మకూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై పలు అవినీతి ఆరోపణలు చేస్తూ గండిపాళెం ప్రాజెక్ట్‌కు చెందిన పలువురు ఆయకట్టు రైతులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
గండిపాళెం జలాశయం
అక్రమ పంథాను కొనసాగించడం ఇరిగేషన్ శాఖలో ఓ కీలక అధికారికి వెన్నతో పెట్టిన విద్య. ఆత్మకూరు డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఈయన ఆక్రమ కార్యకలాపాలను సాగిస్తూ పెద్ద మొత్తాన్ని తన జేబులో వేసుకుంటున్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని ఇరిగేషన్ పరిధిలో గతంలో జరిగిన, ప్రస్తుతం చేపట్టిన పనుల్లో బినామీ కాంట్రాక్టర్లను నియమించుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.