
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని..
● బాలుడి మృతి
దుత్తలూరు: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని బాలుడు మృతిచెందిన ఘటన దుత్తలూరు సెంటర్ సమీపంలోని రెస్ట్ ఏరియా ప్రాంతంలో 565వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. దుత్తలూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత అన్నంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి – జ్యోతి దంపతుల పెద్ద కుమారుడు అన్నంరెడ్డి చేతన్‌రెడ్డి (13) దుత్తలూరు గ్రామం నుంచి రెస్ట్ ఏరియా ఎదురుగా తన తండ్రి నిర్వహిస్తున్న కేఫ్ వద్దకు స్కూటీపై బయలుదేరాడు. జాతీయ రహదారి దాటే క్రమంలో ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా స్కూటీని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని అంబులెన్స్‌లో ఉదయగిరి ప్రభుత వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదం నెలకొంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు.