
కావలిలో చెలరేగిన దొంగలు
కావలి: కావలిలో దొంగలు చెలరేగిపోయారు. గురువారం ఉదయం పది నుంచి 12 గంటల్లోపు నాలుగిళ్లలో తాళాలను తొలగించి చోరీలు చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు సభ్యుల గల ముఠా ఈ చోరీలకు పాల్పడిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివరాలు.. పట్టణంలోని కరెంటాఫీస్ వెనుక వీధిలో ఉన్న సురే మాలకొండారెడ్డి నివాసంలో 37 సవర్ల బంగారం, రూ.40 వేలు.. వెంగళరావునగర్‌లో ఊడల ప్రతాప్ ఇంట్లో 650 గ్రాముల వెండి, ఒక సవరు బంగారం.. జనతాపేటలో అంతోట శోభన్‌బాబు నివాసంలో తొమ్మిది సవర్ల బంగారాన్ని చోరీ చేశారు. ఇందిరానగర్‌లో అద్దూరి లలిత నివాసంలో చోరీకి పాల్పడగా, విలువైన వస్తువులు అపహరణకు గురికాలేదని బాధితురాలు చెప్పారు. ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన దొంగల ముఠా కారులో పట్టణానికి చేరుకొని తాళాలను తొలగించి ఇళ్లలోకి ప్రవేశించారు. చోరీ అనంతరం అదే కారులో వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న జిల్లా పోలీస్ అధికారులు అప్రమత్తమై అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా ప్రొద్దుటూరు దొంగల ముఠా కోసం కొంత కాలంగా ప్రకాశం జిల్లా పోలీసులు వెతుకులాటలో ఉన్నారు. జిల్లా పోలీసుల నుంచి సమాచారం అందుకున్న వారు అప్రమత్తమై ప్రొద్దుటూరు పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో ముఠా సభ్యుల్లో ఒకర్ని వారు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. చోరీ బాధితుల్లో ముగ్గురు ఉపాధ్యాయులు కాగా, ఒకరు రైతు. కావలి డీఎస్పీ శ్రీధర్, వన్ టౌన్ సీఐ ఫిరోజ్ బాధితులతో మాట్లాడి వివరాలను సేకరించారు. వేలిముద్రలను క్లూస్‌టీమ్ సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగిళ్లలో చోరీ
కారులో వచ్చి దొంగతనం చేసి.. పరార్
ప్రొద్దుటూరు ముఠాగా
గుర్తించిన పోలీసులు