
ఇంటూరి.. ఏంటిది..?
ఉలవపాడు: ఇసుక.. గ్రావెల్.. ప్రకృతి వనరులను కొల్లగొట్టి తమ అస్మదీయులకు కట్టబెట్టడంలో నిమగ్నమైన టీడీపీ ప్రజాప్రతినిధుల కళ్లు తాజాగా దేవదాయ భూములపై పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సదరు భూముల కౌలు వేలాన్ని తమ ఇష్టానుసారంగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో గురువారం జరిగిన ఈ ఉదంతానికి ఉలవపాడులోని వేణుగోపాలస్వామి దేవస్థాన ఆవరణ వేదికై ంది.
నిబంధనలు తుంగలో..
నిబంధనలను తుంగలో తొక్కి వేలాన్ని ఎమ్మెల్యే జరిపించారు. వాస్తవానికి ఉలవపాడులోని వేణుగోపాలస్వామి దేవస్థానానికి సంబంధించి కందుకూరు మండలం గోపాలపురంలో 172.48 ఎకకాల భూమిని కౌలుకిచ్చేందుకు బహిరంగ వేలాన్ని నిర్వహించారు. గతంలో ఈ భూమిని సాగు చేసుకుంటున్న రైతులు, నూతనంగా చేసుకోవాలనుకునే వారు దరావతును చెల్లించారు. అయితే కూటమి ప్రభుత్వం తాము అనుకున్న విధంగా తమకు నచ్చినవారికే వేలం వచ్చేలా చూడాలని నిర్ణయించుకున్నారు. దీనికి గానూ పోలీసులను భారీగా మోహరించారు. వీటిని దక్కించుకోవాలనే లక్ష్యంతో అరాచకంగా వ్యవహరించారు.
అంతా ఏకపక్షం..
వేలాన్ని ఎమ్మెల్యే దగ్గరుండి మరీ అరాచకంగా నిర్వహించారు. వేలం ప్రారంభమవ్వగానే తొలుత ఎవరైనా పాట పాడితే నగదు విలువ చెప్పారు. ఇలా ప్రారంభమైన వెంటనే తమకు నచ్చిన వారు రావడం, వెంటనే మూడు సెకన్లలో మూడు సార్లు పలకడం, ఆపై పేరును ఖరారు చేశారు. దీనిపై ప్రశ్నిస్తే, వెంటనే వచ్చి కూర్చోండి ఆ బిట్ అయిపోయింది, తర్వాత వేలం జరుగుతుందని పోలీసులు చెప్పారు. మొత్తం 48 పొలం బిట్లకు వేలం జరగ్గా, తొలుత నాలుగు బిట్లకు నిర్వహించిన తీరుతోనే ప్రక్రియ మొత్తం అర్థమైపోయింది. ఎమ్మెల్యే చెప్పిన పేర్లను ప్రకటించడం తప్ప వేలం సక్రమంగా జరగలేదని నిర్ధారించుకున్నారు. రూ.ఐదు వేల దరావతు చెల్లించి వేలానికి హాజరైన ఎక్కువ మంది రైతులు బయటకొచ్చేశారు. ఆపై అధికారులు, కూటమి నేతలు ఎమ్మెల్యే సమక్షంలో కూర్చొని నచ్చిన పేర్లకు కౌలు వచ్చేలా చూశారు.
పాత్రికేయులకు బెదిరింపులు
ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడం బాధాకరమని పలువురు రైతులు వాపోయారు. అప్రజాస్వామికంగా జరగడంతో తాము బయటకొచ్చేశామని చెప్పారు. లోపలికెళ్లిన పాత్రికేయులను సైతం ఎందుకొచ్చారు.. బయటకెళ్లిపోండి.. ఫొటోలు, వీడియోలు తీయొద్దు.. తర్వాత ఈఓ చెప్తారంటూ కందుకూరు రూరల్ ఎస్సై మహేంద్ర బెదిరించి బయటకు పంపారు. ఓ పత్రిక విలేకరిని దగ్గరుండి బయటకు సాగనంపారు. గతేడాది 172.48 ఎకరాల భూమికి రూ.7.78 లక్షల కౌలు రాగా, ప్రస్తుతం రూ.18 లక్షలు లభించింది. 128 మంది రైతులు వేలానికి హాజరయ్యారు. ఈఓలు నరసింహదాసు, రవీంద్రనాథ్, సునీల్, రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అన్యాయంగా
దేవదాయ భూముల వేలం
కూటమి నేతలకు కట్టబెట్టిన వైనం
దగ్గరుండి మరీ ఎమ్మెల్యే అరాచకం
పోలీసులు, అధికారుల
సహకారంతో బరితెగింపు
బహిష్కరించిన అధిక శాతం రైతులు