
మా భూములిచ్చే ప్రసక్తే లేదు
● ఉప్పరపాళెం ఎస్సీ, ఎస్టీల ఏకగ్రీవ తీర్మానం
ఉలవపాడు: ఇండో సోలార్ కంపెనీకి కారు చౌకగా ఎస్సీ, ఎస్టీల భూములు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, కానీ మా భూములిచ్చే ప్రసక్తే లేదని కరేడు రెవెన్యూ పరిధిలోని ఉప్పరపాళెం ఎస్సీ, ఎస్టీ రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆదివారం స్థానిక ఎంపీపీ స్కూల్‌లో రామకృష్ణాపురం, ఉప్పరపాళెం, పొట్టేనుగుంట రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా నేత కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న భూసేకరణపై ఎస్సీ, ఎస్టీలకు ఉన్న భయాందోళనలను అధికారులు తొలగించాలని కోరారు. పరిశ్రమల పేరుతో బలవంతంగా భూసేకరణ చేస్తే ఎలా అన్నారు. భూములు, ఇళ్లు పోతే నిరాశ్రయులుగా మారుతారన్నారు. తక్షణమే బలవంతపు సేకరణ ఆపి ప్రజల్లో ఉన్న భయాందోళనలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిర్వాసితుల సమన్వయ కమిటీ తరఫున గంజి యలమంద, సుదర్శి మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు రామలక్ష్మమ్మ, సీఐటీయూ నాయకులు గంజి శ్రీనివాసులు, రామకోటయ్య, గిరి, విజయ్, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు నాగార్జున, సుజాత, అంకమ్మరావు, ఐద్వా నాయకులు లలితమ్మ, పెంచలమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.