
ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు ముమ్మరం
నెల్లూరు(క్రైమ్): ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు లాడ్జీల్లో తనిఖీలు చేశారు. వాహనదారుల పత్రాలను పరిశీలించి నిబంధనల ఉల్లంఘనులపై కేసులు నమోదు చేశారు. జరిమానాలు విధించారు. జిల్లా వ్యాప్తంగా 96 లాడ్జీల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బస చేసిన వ్యక్తులు వివరాలను తెలుసుకున్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, బస చేసిన వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అందజేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. లాడ్జీ పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 30 మందిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 70 మందికి రూ.43,080 జరిమానాలు విధించారు. రికార్డులు, నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.
వివరాల సేకరణ
నెల్లూరు నగరంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర డీఎస్పీ పి.సింధుప్రియల పర్యవేక్షణలో అధికారులు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఫిన్స్ సహాయంతో వేలిముద్రలను పరిశీలించారు. మందుబాబులు, అల్లరిమూకలపై కొరడా ఝళిపించారు. అర్ధరాత్రి పలువురు బైక్‌లపై వెళ్తుండగా ఆపి వివరాలు సేకరించారు. అనవసరంగా రాత్రివేళల్లో రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్స్, దుకాణాలు నిర్ణీత వేళల్లోనే మూసివేయాలని లేకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా ఏఎస్పీ తెలిపారు. నెల్లూరు నగరంలో చిన్నబజారు, సంతపేట, దర్గామిట్ట, బాలాజీనగర్, సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, దశరథరామారావు, రోశయ్య, సాంబశివరావు, వెంకటరెడ్డి, ఎస్సైలు, సిబ్బంది తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు.
డ్రోన్లతో నిఘా
డ్రోన్లతో నెల్లూరు శివారు ప్రదేశాలను పరిశీలించారు. బహిరంగంగా మద్యం తాగుతున్న 70 మందిపై కేసులు నమోదు చేశారు. నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాల్లో డ్రోన్లతో నిత్యం నిఘా ఉంచినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న బంగ్లాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, నదీ తీరాల్లో డ్రోన్లతో నిఘా పెట్టామన్నారు. ఓపెన్ డ్రింకింగ్, పేకాట, మత్తు పదార్థాల వినియోగంపై చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి సేవించడం, అమ్మడం, రవాణా చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు ముమ్మరం

ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు ముమ్మరం